భద్రత విషయంలో ఈ చౌకీదార్ నిద్రపోడు

భద్రత అంశంలో ఈ కాపలాదారుడు నిద్రపోడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్‌లలో జరిగిన బహిరంగసభల్లో మాట్లాడుతూ పాకిస్థాన్‌లోని బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన నిర్వహించిన వైమానికదాడులపై ఆధారాలు అడుగుతున్న వారిపై మండిపడ్డారు. ఆధారాలు అడుతున్న వారందరికీ.. 130 కోట్ల ప్రజల విశ్వాసమే సాక్ష్యమని స్పష్టం చేశారు. 

నవీన భారతంలో కొత్త పద్ధతులు, విధానాలతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. 2016లో జమ్మూకశ్మీర్లోని ఉరిలో ఉగ్రదాడి జరిగిందని, ఇందుకు ప్రతిగా మనం తొలిసారి ఉగ్రవాదులకు అర్ధమయ్యే భాషలో మెరుపుదాడులతో దీటుగా జవాబిచ్చామని చెప్పారు.

 ఈ సందర్భంగా ముంబై దాడులను మోదీ ప్రస్తావించారు. 26/11 ముంబై దాడుల అనంతరం ఉగ్రదాడి ఘటనలను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయిందని విమర్శించారు. ప్రతిదాడి చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని  సైన్యం చెప్పినా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించినట్టుగా కథనాలు వచ్చాయని పేర్కొన్నారు.

ప్రతిదాడుల సంగతి పట్టించుకోకుండా.. హోంమంత్రులను మార్చడంలో కాంగ్రెస్ బిజీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ’2016 ఉరి దాడి తర్వాత పాకిస్థాన్‌కు మనం (భారత్) గట్టిగా వారి భాషలోనే జవాబిచ్చాం. 2008 ముంబై దాడుల తర్వాత కాంగ్రెస్ నాయకత్వం మాత్రం  నిద్రపోయింది. ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారా? ఈ చౌకీదార్ (తనను ఉద్దేశించి) మాత్రం నిద్రపోడు’ అని మోదీ స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న దాడులు, పేలుళ్లు గతంలోనూ జరిగాయని, అయితే గత ప్రభుత్వాలు కేవలం హోం మినిస్టర్లను మార్చడం మినహా చేసిందేమిటని ఆయన నిలదీశారు. ’మీరే చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో హోం మంత్రిని మార్చాలా? విధానాల్లో మార్పు తీసుకురావాలా?’ అని సభికులను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రఘటన ముంబైలో జరిగిందన్నారు.

భారీ ఆయుధాలతో పది మంది ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 166 మంది ప్రజలు చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారని ఆనాటి ఘటనను మోదీ గుర్తుచేశారు. ఫిబ్రవరి 24 తెల్లవారుజామున బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడులను మోదీ ప్రస్తావిస్తూ, తెల్లవారుజామున 3 గంటల నుంచి పరిస్థితిని భారత్ సమీక్షిస్తూ వచ్చిందని, 5 గంటల సమయానికి శత్రు దేశం నుంచి ’మోదీ మనను హిట్ చేశారు’ అంటూ ఏడుపులు మొదలయ్యాయని చెప్పారు.

2014 ముందు వరకూ భారత్‌పై దాడి చేసి ఎన్నిసార్లు గాయపరిచినా, పరోక్ష యుద్ధాలు, దాడులు చేసినా స్పందించదనే అభిప్రాయంతోనే పాక్ ఉండేదని తెలిపారు. ఎందుకంటే.. అప్పటివరకూ రిమోట్ కంట్రోల్‌తో కూడిన ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నందునే పాకిస్థాన్ ధీమాగా ఉండడానికి కారణమని ఎద్దేవా చేశారు. ఆ ధీమాతోనే మన శత్రువులు తమ ఉగ్రదాడుల ధోరణిని పెంచిపోషిస్తూ వచ్చారని ధ్వజమెత్తారు. 

మేము అధికారంలోకి వచ్చాకా.. ఉగ్రవాదుల భాషలోనే ప్రతిదాడులకు దిగుతుండడంతో ఇప్పుడు పాకిస్థాన్ ఏడుస్తున్నదని పేర్కొన్నారు. ఈరోజు అధికారం కోసం పోటీ పడుతున్న వారిలోని ప్రతి అవినీతిపరుడికి నాతో సమస్య వచ్చిపడిందని చెబుతూ అందుకే ఈ చౌకీదారును పోటీపడి తిడుతున్నారని తెలిపారు. నన్ను ఎంత తిడితే ఆ స్థాయిలో ఓట్లు పడతాయన్న భావనతోనే.. తిడుతున్నారని మోదీ విమర్శించారు.