2017 నుంచి ఏపీలో తెలంగాణ ఓట్లు : కన్నా

తెలంగాణలో ఉన్న ఓట్లను ఏపీలో చేర్చే ప్రక్రియకు 2017 నుంచే టీడీపీ పూనుకుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఆరోపించారు. ఏ గడ్డి తిని అయినా అధికారంలోకి రావాలని బాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫామ్‌-7 దాఖలు చేస్తే టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని తిరుపతిలో మండిపడ్డారు.

ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం నేరమని స్పష్టం చేశారు. డేటా చోరీ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న టీడీపీ నేతలు భుజాలెందుకు తడుముకొంటున్నారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రంలో నమోదైన చిన్న కేసు విషయమై ఏపీలో సిట్‌ ఎందుకు వేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

డేటా చోరీ కేసుతో టీడీపీ నాయకులంతా గాబరా పడుతున్నారని చెబుతూ  ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బ్లాక్‌మెయిల్‌కు దిగుతోందని నిలదీశారు. . రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని గొంతు చించుకుంటున్న టీడీపీ పరువు నష్టం దావా ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు.

తెలుగుదేశం తీరు చూస్తే డేటా చోరీకి పాల్పడినట్టు తెలుస్తోందని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసులో మాదిరిగానే  చంద్రబాబు తీరు ఉందని ధ్వజమెత్తారు. ఓటర్ల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు.

డేటా చోరీపై నియమించిన మూడు సిట్‌ల నివేదిల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపిందని వెల్లడించారు. ఈ నెల 13న బీజేపీ-బస్సుయాత్ర విజయనగరంలో ప్రారంభమై 21న కడపలో ముగుస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు.