కాశీ ఆలయ అభివృద్ధికి సహకరించని ఎస్పీ

వారణాసిలో ఆలయ అభివృద్ధి, సుందరీకరణ పనులకు సంబంధించి గతంలోని ఎస్పీ ప్రభుత్వం సహకరించలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. అప్పటి ఎస్పీ సర్కార్ నిర్వాకం కారణంగానే సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. కాశీ విశ్వనాధ ఆలయ అప్రోచ్ రోడు, సుందరీకరణ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తూ ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులకు తొలి మూడేళ్లలో అధికారంలో ఉన్న ఎస్పీ ప్రభుత్వం సహకరించలేదని, యోగి ఆదిత్యానాథ్‌ను సీఎంగా చేసిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు ఊపందుకున్నాయని పేర్కొన్నారు. 

గత ఎస్పీ ప్రభుత్వం సహకరిస్తే ప్రస్తుతం శంకుస్థ్ధాపనకు బదులు ఆయా పనుల ప్రారంభోత్సవం జరిగి ఉండేదని ప్రధాని చెప్పుకొచ్చారు. ఏడు దశాబ్దాలుగా ఏ ఒక్క ప్రభుత్వం కాశీ విశ్వేశ్వరుడి గురించి ఆలోచించలేదని, ఆయా ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసమే పనిచేసి, కాశీని విస్మరించాయని మోదీ విమర్శించారు. కాశీని అభివృద్ధి చేయాలన్నది తన చిరకాల స్వప్నమని, అందుకే తాను ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు పలుసార్లు ఇక్కడికి వచ్చానని, ఇక్కడ అభివృద్ధి జరగాలని కోరుకున్నానని చెప్పారు.

కాశీ విశ్వనాధుని ఆశీస్సులతో తన స్వప్నం ఫలించే సమయం ఆసన్నమైందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్రమణలతో కూరుకుపోయిన కాశీ విశ్వనాధ సన్నిధికి ముక్తి కలుగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆక్రమణలు తొలగించి తాము సమీప భవనాలు స్వాధీనం చేసుకున్న తర్వాత 40 పురాతన దేవాలయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. వారణాసిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మోదీ ప్రకటించారు.