కశ్మీరీలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

కశ్మీరీలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. కాన్పూర్, వారణాసి ఘజియాబాద్‌ల్లో జరిగిన వేర్వేరు బహిరంగ సభల్లో మాట్లాడుతూ  లక్నోలో ఇద్దరు కశ్మీరీ డ్రైఫ్రూట్స్ వ్యాపారులపై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెర్రివాళ్లని అభివర్ణించారు. తర్వాత ట్విట్టర్ వేదికగా ఇదే వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల మధ్య ఐక్యతా వాతావరణం కాపాడటం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. 

మన కశ్మీరీ సోదరులపై దాడికి పాల్పడిన వెర్రివాళ్లను వెంటనే అరెస్ట్ చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. పుల్వామా ఉగ్ర దాడి తర్వాత సైనిక బలగాలు ప్రదర్శించిన శౌర్య ప్రతాపాలను యావత్ జాతి వీక్షించిందని, కానీ విపక్షాలు మాత్రం బలగాలను అవమానిస్తున్నాయని, ఇది విచారకరమని ధ్వజమెత్తారు.

ఉగ్రవాదంపై చర్యలు తీసుకొనేలా పాకిస్థాన్‌పై యావత్ ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్న తరుణంలో విపక్షాల ప్రకటనలు పొరుగుదేశానికి సహకరించేలా ఉన్నాయని మండిపడ్డారు. విపక్షాల ప్రకటనల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ అబద్ధాలను వ్యాపింపజేస్తున్నదని మోదీ మండిపడ్డారు. విపక్షాలు ఏర్పాటు చేస్తున్న మహా కూటమి ఒక మహా కల్తీ అని ఎద్దేవా చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి  పిలుపునిచ్చారు. దేశంలో తీవ్రవాదం, అవినీతి, పేదరికం నిర్మూలన కోసం స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాన్పూర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్నో మెట్రో నార్త్-సౌత్ కారిడార్ పరిధిలో రైలు సర్వీసులను ప్రారంభించారు. ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో యూపీ గవర్నర్ రామ్‌నాయక్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర యూపీ మంత్రులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు ప్రధాని తాళాలు అందించారు.