ద్రవ్యలోటు కట్టడి చేస్తామని ఆర్ధిక శాఖ ధీమా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 3.4 శాతం ద్రవ్యలోటు లక్ష్యంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. పరోక్ష పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టినప్పటికీ ఖర్చులు తగ్గించుకోవడంతో ఈ లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. 

ఢిల్లీలో జరుగుతున్న ఐవీసీఏ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ద్రవ్యలోటు లక్ష్యం మేరకు కట్టడి చేసేదానిపై ఎలాంటి అనుమానం లేదని స్పష్టంచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ద్రవ్యలోటును 3.4 శాతానికి తగ్గించాలనుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనామేరకు వసూలయ్యే అవకాశం ఉన్నదని, కానీ పరోక్ష పన్ను వసూళ్లు మాత్రం తగ్గనుండటంతో ఖర్చులను కట్టుదిట్టం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 7-8 శాతం వృద్ధిరేటు సాధిస్తే ప్రైవేట్ ఈక్విటీ(పీఈ)ల్లోనూ, వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీల్లోనూ ఎలాంటి పెరుగుదల కనిపించదన్నారు. 2018-19లో రూ.12 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్ను వసూళ్లు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.