బీజేపీ ఉపాధ్యక్షుడుగా, ప్రతినిధిగా జే' పాండా

లోక్‌సభ మాజీ ఎంపీ బైజయంత్ 'జే' పాండాకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా, అధికార ప్రతినిధిగా ఆయనను పార్టీ నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ తాజా నియామకం జరిపారు. బైజయంత్ పాండా నియామకం  వెంటనే అమల్లోకి వచ్చింది.

బిజూ జనతాదళ్ లో కీలక నేతగా వ్యవహరించిన ఆయన తొమ్మిది నెలల క్రితం రాజీనామా చేసి బైటకు వచ్చారు. ఈ వారమే, గత 4న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. తొమ్మిది నెలల పాటు తీవ్ర అంతర్మథనం, మిత్రులు, ప్రజలతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఒడిశాకు, దేశ ప్రజలకు సేవ చేసేందుకు మోదీ నాయకత్వంలో పనిచేయాలని శివరాత్రి పర్వదినాన నిర్ణయం తీసుకున్నట్టు పాండా ఇటీవల ట్వీట్ చేశారు.

గత ఏడాది జనవరిలో  బీజేడీ నుంచి పాండాను పార్టీ శిక్షణ ఉల్లంఘించారంటూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్  సస్పెండ్ చేశారు. అయితే ఆ రోపణలను పాండా ఖండించారు. 22 ఏళ్ల క్రితమే తాను బీజేపీలో చేరాలనే ఆలోచన చేశానని, అయితే తుది నిర్ణయం తీసుకోవడానికి ఇన్నేళ్లు పట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా నాయకత్వ పటిమకు తాను ముగ్దుడ్ని అయినట్టు కూడా చెప్పారు.

 లోక్ సభ తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో బిజెడి స్థానంలో పాగా వేయడం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ వైపు ఇప్పుడు పలువురు సీనియర్ నేతలు చూస్తున్నారు.