ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు కళ్లెం వేయం!

ప్రజాస్వామ్య పరంగా ప్రజలకు ఉన్న హక్కులకు కళ్లెం వేయబోమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేసారు. ఇటీవల దేశంలోని ఐదుగురు హక్కుల ఉద్యమకారులను  పుణె పోలీసులు అరెస్టు చేయడంతో వివాదం చెలరేగడం, వారు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహ నిర్బంధంలో ఉంటటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పలు అంశాలపై వివరణ ఇస్తూ ‘ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది. ఏం చేయాలన్నా చేసుకోవచ్చు.. కానీ, దేశాన్ని అస్థిరపరిచే చర్యలకు పాల్పడే అవకాశాన్ని మాత్రం ఇవ్వం’ అని హెచ్చరించారు. దేశంలో హింసను చెలరేగనివ్వమని చెబుతూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. 2012లోనూ చాలా మంది సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారని గుర్తు చేస్తూ అప్పట్లో కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయని పేర్కొన్నారు.  

‘ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించినా, ఏదైనా భావజాలాన్ని వ్యాప్తి చేయాలని హింసను ప్రోత్సహించినా, దేశాన్ని విడగొట్టాలని కుట్రలు పన్నినా అంతకన్నా పెద్ద నేరం ఏదీ ఉండదు’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉద్ఘాటించారు. ‘ప్రస్తుతం మావోయిస్టులు తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి పలు పద్ధతులను అవలంభిస్తున్నారు. ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి పట్టణ ప్రాంతాల్లోనూ పనిచేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో హింస చెలరేగేలా చేయాలని ప్రయత్నిస్తున్నారని మాకు తెలిసింది’ అని ఆయన ఆరోపించారు.

పాకిస్థాన్‌ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ గురించి రాజ్‌నాథ్ సింగ్‌ స్పందిస్తూ ‘పాక్‌కు కొత్త సారథి వచ్చారు. ఆయన ఇంతకు ముదు క్రికెట్ మైదానంలోనే ఆడారు. ఇప్పుడు రాజకీయ మైదానంలో ఆడాల్సి ఉంది. దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన ఏ మేరకు విజయవంతం అవుతారో చూద్దాం. ఆయన తన ప్రయత్నంలో విజయవంతం కావడానికి శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.