కాంగ్రెస్ వైపు చంద్రబాబు చూపు !

కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల నుండి ఆవిర్భవించిన తెలుగు దేశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడిపిస్తున్నారు. కాంగ్రెస్ తో నడచి అడుగులు వేయడానికి వెనుకాడటం లేదు. లోక్ సభ లో కాంగ్రెస్ తో కలసి మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇప్పుడు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధికి టిడిపి సభ్యులు వోట్ వేశారు. బెంగుళూరులో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణశ్వీకారం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భుజం, భుజం కలిపి తామిద్దరం కామ్రేడ్స్ అన్న సంకేతం ఇచ్చారు. తెలుగు దేశం చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ నేతలతో కలసి రాజకీయ వేదికను పంచుకోవడం జరిగింది. తెలుగు దేశం పెట్టిన కొత్తలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల సదస్సులను ఏర్పాటు చేసిన ఘనత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు దక్కింది. ఇప్పుడు అస్తిత్వ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ కు చేయి అందించే ప్రయత్నం చంద్రబాబునాయుడు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. గతవారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులకు జరిగిన ఎన్నికలలో రాజ్యసభలో తెలుగు దేశం అభ్యర్థి సియం రమేష్ కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కలసి పోటీ చేయడం కోసం బహిరంగంగానే కసరత్తు జరుగుతున్నది. తెలుగు దేశం పోటీ చేసే స్థానాలను సహితం ఇప్పటికే గురించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సహితం లోపాయికారి అవగాహనకు సిద్దపడుతున్నారు. ఏపీ విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యులు సానుకూలంగా మాట్లాడటంతో ఆ పార్టీ పట్ల తెలుగు ప్రజలలో ఏర్పడిన ద్వేషభవం తగ్గుతున్నదని అంటూ గతనెలలో చంద్రబాబునాయుడు పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం.