మిజోరాం గవర్నర్ రాజీనామా.. తిరువనంతపురం నుండి పోటీ !

తొమ్మిది నెలల క్రితం గవర్నర్‌గా నియమితులైన మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి శుక్రవారంనాడు రాజీనామా చేశారు. కేరళ బీజేపీ మాజీ చీఫ్ అయిన రాజశేఖరన్ 2019 లోక్‌సభ ఎన్నికలతో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుది.

తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ పై పోటీ పెట్టాలని బిజెపి నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు కేరళలో ఒక్క లోక్ సభ సీట్ కూడా గెలుపొందలేని బిజెపి ఈ సారి ఎట్లాగైనా కొన్ని సీట్లు గెలుపొందడం కోసం పట్టుదలగా కృషి చేస్తున్నది. అందులో భాగంగా తొలినుండి రాష్ట్రంలో అన్ని సీట్లలో కన్నా ఎక్కువ ఓట్లు వస్తున్న తిరువనంతపురంపై పార్టీ దృష్టి పడింది. 

'నేను కేరళలోనే ఉండాలన్న పార్టీ కోరింది. నా అభిమతం కూడా అదే. అందుకే గవర్నర్ పదవికి రాజీనామా చేశాను' అని రాజశేఖరన్ కేరళ టీవీ ఛానెల్‌కు తెలిపారు. 2014 ఎన్నికలలో కేవలం 14 వేలకు పైగా ఓట్లతో బిజెపి తిరువనంతపురంలో ఓటమి చెందింది.

గత కొంతకాలంగా ఇక్కడి నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ రాజగోపాలం ఎమ్యెల్యేగా గత ఎన్నికలలో ఎన్నిక కావడంతో హిందుత్వ నేతగా పేరున్న రాజశేఖరన్ మంచి పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కేరళ శాసన సభలో అడుగుపెట్టిన మొదటి బిజెపి నేత రాజగోపాలన్ కావడం గమనార్హం.

పైగా, ఆయన అయ్యప్ప భక్తుడు కావడం, అయ్యప్ప భక్తులలో మంచి పలుకుబడి ఉండటం కూడా కొంత కలసి వస్తుంది.బీజేపీకి, సంఘ్ పరవార్‌కు ఇది చాలా సంతోషకరమైన వార్త అని రాజశేఖరన్ రాజీనామాపై కేరళ బీజేపీ అధ్యక్షుడు పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు.

కాగా, రాష్ట్రపతి కార్యాలయం అధికారిక సమాచారం ప్రకారం, రాజశేఖరన్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అంగీకరించారు. అసోం గవర్నర్‌ ప్రొఫెషర్ జగదీష్ ముఖికి మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.