ఐటీ గ్రిడ్ లో తెలంగాణ డేటా కూడా చోరీ !

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డేటా కుంభకోణం మరోమలుపు తిరిగింది. ఐటీ గ్రిడ్ డేటాలో ఆంధ్ర ప్రజల వ్యక్తిగత వివరాలతో పాటు తెలంగాణ ప్రజల వ్యక్తిగత వివరాలు సైతం ఉన్నాయని సిట్ ప్రత్యేక అధికారి స్టీఫెన్ రవీంద్రం వెల్లడించారు. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల వ్యక్తిగత వివరాల అంశం ముడిపడి ఉండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాల వద్ద గోప్యంగా ఉండాల్సిన రహస్య వివరాలు బయటకుపొక్కడంపై తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతోంది. 

ఐటీ గ్రిడ్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది, ఈ సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఐటీ గ్రిడ్ ఇండియాప్రైవేట్ లిమిటెడ్‌కు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల వ్యక్తిగత వివరాలతో కూడిన డేటాను ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వారివ్వకపోతే వారిచేతికెలా వచ్చింది, దానిని వారు చోరీ చేశారా? ఆ డేటాను ఎందుకు వాడుతున్నారు? అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తును నిర్వహిస్తామని ప్రకటించారు. 

ఐటీ గ్రిడ్‌తో పాటు విశాఖపట్నంలో ఉన్న బ్లూఫ్రాగ్ సంస్థలతో పాటు మరే ఇతర సంస్థలకైనా ఇందులో ప్రమే యం ఉందా అనే విషయాలపై దృష్టి పెడతామని తెలిపారు. సున్నితమైన ఈ డేటా ఆధారంగా ఆంధ్రలో ఓట్ల తొలగింపు జరుగుతోందని ప్రధాన రాజకీయ పార్టీల ఆరోపణగా ఉందని గుర్తు చేశారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ ఎక్కడ ఉన్నది సమాచారం తెలియదని చెబుతూ చట్టప్రకారం అశోక్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఐటీ గ్రిడ్ కుంభకోణం వ్యవహారం కచ్చితంగా బట్టబయలు చేస్తామని, ఇందులో ఉన్న నేరస్థులను కోర్టు ముందు దోషులుగా నిలబెడతామని వెల్లడించారు. 

ఐటీ గ్రిడ్‌లో ఉన్న సమాచారాన్ని శాస్త్రీయంగా, సాంకేతికంగా ఐటీ నిపుణులతో విశ్లేషించడానికి  ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఐటీ గ్రిడ్‌లో స్వాధీనం చేసుకున్న డేటాలో ఆంధ్ర ప్రజల వ్యక్తిగత అంశాలైన కులం, వయసు, వృత్తి, ఊరు, పేరు, బ్యాంక్ ఖాతాలు, ఆధార్‌కార్డ్ వివరాలు ఉన్నాయని చెప్పారు.తెలుగుదేశం పార్టీ అధికారిక యాప్ సేవామిత్రను ఐటీ గ్రిడ్ ఉపయోగించుకుంటోందని తెలిపారు.

ఫిబ్రవరి 23న ఐటీ గ్రిడ్‌కు సైబారాబాద్ పోలీసులు వెళ్ళారని అయితే ప్రాథమిక సమాచారం మాత్రమే సేకరించారని చెప్పారు. అక్కడి నుంచి ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదన్నారు. ఎన్నికల కమిషన్‌తో కూడా చర్చలు జరుపుతామని తెలిపారు. ఐటీ గ్రిడ్ డేటా వ్యవహారంపై అమెజాన్, గూగుల్ సంస్థలకు ఇప్పటికే లేఖలు రాశామని చెబుతూ మరో నాలుగైదు రోజుల్లో ఆయా సంస్థలు ఐటీ గ్రిడ్ డేటాలో ఉన్న సమాచారాన్ని పోలీసులకు అందచేస్తారని వెల్లడించారు. 

ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ లొంగిపోతేనే వాస్తవాలు బయటికి వస్తాయని పేర్కొంటూ సేవామిత్రలో మార్పులు చేర్పులు ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. సేవామిత్రలో ఓటర్లకు సంబంధించిన వివరాలు మాయం అయ్యాయని, వాటిని ఇంత త్వరగా మార్చాల్సిన అవసరం ఏమిటో దర్యాప్తులో వెలుగు చూస్తాయని చెప్పారు.