జన్‌ఔషధి పథకంతో రూ 1,000 కోట్ల ఆదా

 జన్‌ఔషధి పథకాన్ని అమలులోకి తేవడంతో ప్రజలకు రూ.1000 కోట్ల మేర ఆదా అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ పథకం అమలుతో చౌక ధరలకే నాణ్యతతో కూడిన ఔషధాలను అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) పథకం లబ్ధి దారులు, జన ఔషధి దుకాణాల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. నాణ్యత గల ఔషధాలు తక్కువ ధరలకే ప్రజలకు లభించడానికి ప్రభుత్వం ఇప్పటికే రెండు రకాల చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా చెప్పారు. తొలుత 850 అత్యవసర ఔషధాల ధరలను నియంత్రించ గలిగామని తెలిపారు. 

అలాగే గుండె చికిత్సకు వాడే స్టెంట్లు, కీళ్ల సర్జరీకి వినియోగించే పరికరాల ధరలను తగ్గించడం జరిగిందని చెప్పారు. రెండో విడత చర్యగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల జనౌషదీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ చర్యలు ఊహించినదానికంటే అధికంగా ఫలవంతమయ్యాయని, పేద ప్రజలకే కాకుండా మధ్య తరగతి ప్రజలకు సైతం ఈ పథకం లబ్ధిని చేకూర్చుతోందన్నారు.  

గత నాలుగున్నరేండ్లలో దేశవ్యాప్తంగా ఐదువేలకు పైగా జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

 ఈ పథకంపై ఇంతవరకు ఎలాంటి ప్రచారం జరగపోయినా ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు సుమారు 1000 కోట్ల రూపాయల మేర ఆదా అయ్యిందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. జనౌషధీ కేంద్రాల్లో మందులు మార్కెట్ రేటుకన్నా సుమారు 50 నుంచి 90 శాతం తక్కువ ధరలకు లభిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 

గడచిన నాలుగున్నరేళ్లలో సుమారు 5వేల జనౌషధీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా నాణ్యతగల ఔషధాలను సరసమైన ధరలకు అందించడమేగాక, స్వయం ఉపాధిని, సరికొత్త ఉపాధి అవకాశాలను కూడా కలుగజేయడం జరుగుతోందన్నారు. ఈ ఔషధాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు, జనరిక్ ఔషధాల వినియోగానికి అవసరమైన సలహాలు, సదుపాయాల కల్పనకు ప్రతియేటా డిసెంబర్ 7న ‘జనౌషధీ దివస్’గా పాటిస్తున్నట్టు తెలిపారు. 

ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. 

ఆరోగ్య రంగంలో పవిత్రమైన పరివర్తన కోసం కృషి చేస్తున్నామని అది సత్వర ఫలితాలివ్వడం పట్ల సంతోషం ప్రకటించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 15 కొత్త ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసి భవన నిర్మాణాలను చేపట్టడం జరిగిందని వివరించారు. వీటిలో కొన్ని ప్రస్తుతం నిర్మాణం పూర్తికాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

 అలాగే వైద్య కళాశాలల్లో 31 వేల ఎంబీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లను కొత్తగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ‘ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషదీ పరియోజన’ లబ్ధిదారులు తమకు అందుతున్న సదుపాయాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.