మెరుపు దాడుల సాక్ష్యాలా రాహుల్ ... సిగ్గు పడాలి

ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దళాలు చేసిన దాడులపై రాహుల్‌గాంధీ సాక్ష్యాలు అడిగినందుకు సిగ్గుపడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. సాక్ష్యాలు అడగడం ద్వారా భద్రతాదళాలను అవమానపరిచారని దుయ్యబట్టారు. 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొంటూ  వైమానికదాడుల్లో తాము లక్ష్యాలను చేధించామని ఐఏఎఫ్ అధికారి చెప్పినా రాహుల్ సాక్ష్యాలు అడుగుతున్నారని విమర్శించారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారని, దీనికి ప్రతిగా మన వైమానిక దళాలు సర్జికల్  స్ట్రుక్ నిర్వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా మోదీపై షా ప్రసంశలు గుప్పిస్తూ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం గడిచిన 25 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా మోదీ సెలవు తీసుకోకుండా పని చేశారని వెల్లడించారు. రోజుకు 18 గంటల పాటు మోదీ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.  

ఈ సందర్భంగా రాహుల్‌ను ప్రస్తావిస్తూ ఆయన తరుచూ సెలవులు పెడతారని అపహాస్యం చేశారు. మోదీ మళ్లీ ప్రధాని కాగానే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ నిర్వహించి అక్రమ చొరబాటుదారులను తరిమివేస్తామని, దేశాన్ని సురక్షితంగా ఉంచుతామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన 55 నెలల్లో పేదల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశఆరు. 

55 నెలల్లో మోదీ సర్కారు.. 135 సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పిన ఆయన పేదలకు ఉచితంగా నాణ్యమైన చికిత్స అందించడానికి ఆయుష్మాన్ భారత్, రైతులకు పంటపెట్టుబడి కింద ఏటా రూ. 6 వేలు, అసంఘటిత కార్మికులకు నెలకు రూ. 3 వేల పింఛన్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రకటించారు.

ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోదీని గెలిపించడం కోసం దేశ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని షా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నక్సల్స్ సహకారంతో చత్తీస్‌ఘడ్ ఎన్నికలలో గెలిచిందని అమిత్‌షా ఆరోపించారు. బీజేపీ ప్రజల మద్దతుతో విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేసారు.