తొలిసారి ఓబీసీ జనాభా లెక్కల సేకరణ!

స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) గణాంకాలను సేకరించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది.  2021 జనాభా లెక్కల సన్నద్ధతపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీలో జరిపిన సమీక్షా సమావేశం సందర్భంగా ఓబీసీల గణాంకాలను సేకరించాలన్న అంశం తెరపైకి వచ్చింది. 2021లో జనాభా లెక్కల సేకరణ చేపట్టిన మూడు ఏండ్లలోపు తుది గణాంకాలు వెల్లడించేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని హోంమంత్రి ఆదేశించారు. ఇంతకుముందు తుది గణాంకాలు తేల్చడానికి ఎనిమిదేళ్లు పట్టేది.

శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల నిష్పత్తి, సంతానోత్పత్తి రేటు వంటి వాటిని లెక్కించే నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశించారు. 125 కోట్ల దేశ జనాభాలెక్కలను సేకరించేందుకు దాదాపు 25 లక్షలమంది ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. కచ్చితమైన సమాచార సేకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇళ్ల ఎంపికకు మ్యాపులు, జియో రిఫరెన్స్‌లను ఉపయోగించాలని యోచిస్తున్నారు.

దేశంలో ఓబీసీల జనాభా దాదాపు 41 శాతం ఉన్నదని జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) ఓ నివేదికను 2006లో విడుదల చేసింది. కాగా తమ జనాభా వివరాలను వెల్లడించాలని పలు ఓబీసీ సంఘాలు సుదీర్ఘకాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి. జనాభాలో సగంకు పైగా తామే ఉన్నామని కుడా వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2021 జనాభా లెక్కల్లో ఓబీసీ గణాంకాలనూ ప్రత్యేకంగా సేకరించాలని భావిస్తున్నారు. దానితో ఈ అంశం 2019 లోక్‌సభ ఎన్నికలపై విశేష ప్రభావం చూపే అవకాశం ఉంది.  

వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. చివరిసారిగా 1931లో దేశంలో కులాల వారీగా చేపట్టిన జనాభా లెక్కలను ఆధారం చేసుకుని ఈ రిజర్వేషన్లను ప్రభుత్వం నిర్ణయించింది. 2011లో యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణనను చేపట్టగా, ఆ వివరాలను 2015లో ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసింది. కులాలకు సంబంధించిన వివరాల్లో మొత్తం 8.19 కోట్ల తప్పులుండగా, 6.73 కోట్ల తప్పులను సరిదిద్దినట్లు ప్రభుత్వం వెల్లడించింది.