అంధుల కోసం ప్రత్యేకంగా నాణేలు


అంధులు గుర్తించే విధంగా వారి సౌకర్యార్థం ప్రధాని నరేంద్ర మోదీ నూతన నాణేలను  ఆవిష్కరించారు. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20ల నాణేలను విడుదల చేశారు. దిల్లీలోని లోక కల్యాణ్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అంధ బాలల సమక్షంలో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఈ కొత్త సిరీస్‌ నాణేలు ఆర్‌బీఐ ద్వారా మాత్రమే విడుదల అవుతాయి. ఈ నాణేలలో ఒక్కోదానికి ఒక్కో ఫీచర్‌ ఉంది. అయితే ఈ నాణేలు ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని మాత్రం ఆర్థిక శాఖ వెల్లడించలేదు.

ఈ నాణేల విలువను బట్టి వాటి బరువు, పరిమాణం కూడా మారుతుంది. వీటిలో రూ.20 నాణెం మాత్రం ఎలాంటి అంచులు లేకుండా గుండ్రంగా ఉండనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ తోపాటు ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌ జైట్లీ, వాణిజ్య శాఖమంత్రి రాధాక్రిష్ణన్‌ పాల్గొన్నారు. ఈ నాణేలను ఆర్థిక శాఖ నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే ముద్రించనున్నారు. ముంబయి, అలీపూర్‌(కలకత్తా), సైఫాబాద్‌(హైదరాబాద్‌), చర్లపల్లి(హైదరాబాద్‌) మింట్‌ కాంపౌండ్లలో వీటిని ముద్రించనున్నారు.

దీంతోపాటు త్వరలో రూ. 20 నాణేన్ని విడుదల చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. ఈ మేరకు నాణెం నమూనాను వెల్లడిస్తూ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 10 నాణెం మాదిరిగా కాకుండా రూ. 20 నాణేన్ని సరికొత్తగా తీసుకొస్తున్నారు. రూ. 10 నాణెం 27 మిల్లీమీటర్ల వ్యాసంతో గుండ్రంగా ఉంటుంది. అయితే రూ. 20 నాణెంకు మాత్రం 12 అంచులు ఉంటాయని ఆర్థికశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంతేగాక.. కొత్త నాణెంపై చివర్లలో ఎలాంటి డిజైన్‌ ఉండదని తెలిపింది.