ఓట్ల తొలగింపు మాయల మరాఠీ బాబు

ఓట్ల తొలగింపు మాయల మరాఠీ చంద్రబాబునాయుడు అని, ఆయన్ను సాగనంపాలని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సోమువీర్రాజు పిలుపిచ్చారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆదోనిలో ధ్వజమెత్తారు. ఓట్ల డేటా ప్రైవేట్ ఐటీ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.

రుణమాఫీ పేరుతో రైతులను మోసంగించిన చంద్రబాబు ఓట్లను తొలగించి ఎలాగైన గద్దెనెక్కాలన్న తలంపుతో ఇలాంటి నీచస్థితికి దిగజారారని దుయ్యబట్టారు. దేశంలోని అవినీతి నాయకులను రాజకీయాల నుంచి తొలగించాల్సి వస్తే మొట్టమొదట బాబును తొలగించాలని పేర్కొన్నారు.  మాటపై నిలబడలేని, నిలకడలేని వ్యక్తి బాబు అని విమర్శించారు. చదువుకునే రోజుల్లోనే ఒక నాయకుని కూతూరుని పెళ్లి చేసుకుంటానని చెప్పిన చంద్రబాబు, ఆ తరువాత మాటమార్చి ఎన్టీ రామారావు కూతూరును పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఇందిరాగాంధీతో మాట్లాడుతూ మామపైన పోటీ చేస్తానని చెప్పి ఆ తరువాత ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరారని ఎద్దేవా చేశారు. లక్ష్మీపార్వతిని తొలుత ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడే పరిచయం చేశారని, ఆ తరువాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తనవైపు తిప్పుకొని లక్ష్మీపార్వతిని బూచిగా చూపి కుట్ర చేశారని పేర్కొన్నారు. లక్ష్మీపార్వతితో సీట్లు ఇప్పించుకుని ఆ తరువాత ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

బీజేపీ కోసం తాను 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నానని చెప్పి ఆ తరువాత మోదీతో జతకట్టి కేవలం రెండు శాతం ఓట్ల మెజార్టీతో ముఖ్యమంత్రి గద్దెనెక్కారని చెప్పారు. కమ్యూనిస్టులు, హీరో శివాజీతో మోదీపై విమర్శలు చేయిస్తూ చివరకు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారని, ఇదీ చంద్రబాబునాయుడు చరిత్ర అని ఆయన దుయ్యబట్టారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబునాయుడు విధానమని, అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని దుయ్యబట్టారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇప్పటి వరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు రాష్ట్రం నిధులతో ఒక్క పని అయినా చేశారా తెలపాలని నిలదీశారు. దీనిపై బహిరంగచర్చకు తాను సిద్దమని సోమువీర్రాజు సవాల్ చేశారు. బాబు కట్టిన ఒక్క ప్రాజెక్టు ఏదో చెప్పాలని ప్రశ్నించారు. మోసకారి చంద్రబాబునాయుడును సాగనంపడానికి జయప్రకాష్‌నారాయణ ఆధ్వర్యంలో జరిగిన సంపూర్ణ విప్లవం లాంటిది రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.