ఈసారి తెలంగాణ ప్రజలు మోదీని బలపర్చాలి


ఈసారి తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని బలపర్చాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పిలుపిచ్చారు. నిజామాబాదులో జరిగిన సభలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తెలంగాణకు రూ. 2 లక్షల కోట్లు మంజూరు చేసిన్నట్లు చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ వైపు మొగ్గు చూపినా లోక్ సభ ఎన్నికలలో బిజెపికి వోట్ వేయవలసిన అవసరం ఉన్నదని స్పష్టం చేస్తూ ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రధానమంత్రి  కోసమని, ముఖ్యమంత్రి కోసం కాదని ఈ సందర్భంగా ప్రజలకు అమిత్ షా గుర్తు చేశారు. 

తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలను గెలిపించుకునే దిశగా బీజేపీ నేతలు పనిచేయాలని , ఎక్కడా ఎలాంటి అసంతృప్తి లేదా అనుమానాలకు తావివ్వకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు ఈ సందర్భంగా ఉద్భోదించారు.   

తెలంగాణాలో గెలిచిన కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపరని షా ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ఓటమిపై నిరాశ చెందమని, గెలవగానే అహంకారం దరి చేరదని చెబుతూ ప్రజల కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంటామని ఆయన ప్రకటించారు.

పారదర్శక పాలన కోసం ముందుకు సాగుతామని, పేదల సంక్షేమం కోసం మోదీ నిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు.  తెలంగాణ ప్రజలు ఆలోచించి, మోదీకి మద్దతు పలకాలని షా విజ్ఞప్తి చేశారు. మరోసారి మోదీ సర్కారు రావాలని కార్యకర్తలతో నినాదాలు చేయించారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అస్సోం నుంచి గుజరాత్ వరకూ గెలుపు లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు కృషి చేస్తున్నారని, దేశ ప్రజలు కూడా మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కార్యకర్తల కృషి కారణంగా ప్రపంచంంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచిందని చెప్పారు.