మంత్రి మండలి సమావేశంపై సర్వత్ర ఆసక్తి

శాసన సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చేస్తున్న కసరత్తులో భాగంగా అత్యంత ప్రతిష్టాకరంగా ఆదివారం హైదరాబాద్ శివారులో లక్షలాది మంది ప్రజలను సమీకరించి భారీ స్థాయలో జరుపతలపెట్టిన ‘ప్రగతి నివేదన’ సభకు సర్వం సిద్దం చేసారు. అయితే ఈ సభకు రెండు గంటల ముందే రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి కలుగుతున్నది. అంతటి భారీ సభకు ముందు మంత్రులు అందరిని సమావేశానికి ఆహ్వానించడం వెనుక బలమైన రాజకీయ ఎత్తుగడ ఉన్దివచ్చని భావిస్తున్నారు.

ముందస్తు ఎన్నికల దిశగా సభకు ముందు శాసనసభ రద్దు చేయడం వంటి సంచలన నిర్ణయమేదైనా మంత్రిమండలిలో కేసీఆర్ తీసుకోబోతున్నారా అనే ఉత్కంఠ వ్యక్తమవుతున్నది. సభ జరిగే రోజు, అంటే సెప్టెంబర్ 2న మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.

ఇప్పటికే ముందస్తు ఎన్నికల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లబోతున్నదని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో మంత్రిమండలి భేటీ కావడంలో ఆంతర్యం ఏమిటనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ భవన్‌లో ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలోనే ప్రగతి నివేదన సభ వేదిక నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కనీవినీ ఎరగనిరీతిలో ప్రగతి నివేదన సభకు భారీ ఏర్పాట్లు చేస్తూనే, అదే రోజు మంత్రిమండలి సమావేశం నిర్వహించడంలోని ఉద్దేశంపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఉహగానాలు వినిపిస్తున్నాయి. సభలో ప్రకటించబోయే వరాల ఆమోదానికి మంత్రిమండలి నిర్వహిస్తున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నా అసలు ఉద్దేశ్యం ముందస్తు ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోవడం కోసమే అని పలువురు భావిస్తున్నారు. మంత్రి మండలిలో తీసుకొనే నిర్ణయాలను కెసిఆర్ స్వయంగా బహిరంగ సభ వేదికగా ప్రకటించే అవకాశం ఉంది.

శాసనసభ రద్దుకు మంత్రిమండలిలో ఆమోదం తీసుకుని అక్కడి నుంచి సభ రద్దు తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేసి, ఆ విషయాన్ని సీఎం బహిరంగ సభలో ప్రకటించే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే టీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. సభలో ప్రకటించబోయే ఉద్యోగ నియామకాలు, ప్రకటించబోయే వరాల ఆమోదానికే మంత్రిమండలి సమావేశం జరుగుతుందని చెబుతున్నారు.

ఈ మంత్రివర్గ సమావేశంలో వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకొని సభ తర్వాత మరోసారి రద్దు కోసం మంత్రివర్గ భేటీ నిర్వహించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. పింఛను మొత్తం పెంపు, ఉద్యోగులకు మధ్యంతర భృతి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి మొదట మంత్రివర్గ సమావేశం జరుగుతుందని, తర్వాత కేవలం శాసనసభ రద్దు కోసమే ఇంకోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని, మొత్తమ్మీద 10వ తేదీలోగా శాసనసభ రద్దు ప్రక్రియ పూర్తవుతుందని కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది.

అయితే ఇటువంటి అంశాలపై నిర్ణయం కోసం బహిరంగ సభ ముందు అర్ధంతరంగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమిటనే ప్రశ్నలు కుడా తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రకటించిన నిర్ణయాలను మరుసటి రోజు మంత్రివర్గంలో ఆమోదించడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు కదా అని అడుగుతున్నారు.