పాక్ ఏం చెబుతుందో.. రాహుల్ అదే ... అమిత్ షా ఎద్దేవా

పాకిస్థాన్ ఏం చెబుతుందో.. రాహుల్ గాంధీ అదే చెబుతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. బాల్‌కోట్‌లో వైమానికి దళాలు జరిపిన మెరుపు దాడుల గురించి పాకిస్థాన్, ఉగ్రవాదులు సాక్షాలు అడడగం లేదని, కానీ రాహుల్‌గాంధీ, మహా కూటమి నేతలు అడుగుతున్నారని మండిపడ్డారు. 

నిజామాబాద్‌లో బుధవారం జరిగిన పార్టీ శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైమానిక దాడుల గురించి రాహుల్‌గాంధీ, మమతా, అఖిలేష్, మాయావతి, చంద్రబాబు వంటి వారంతా సిగ్గు లేకుండా సాక్షాలు అడుగుతూ సైనికుల వీరత్యాన్ని అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ ఓ వైపు, రాహుల్ బాబా ఆధ్వర్యంలోని మహాకూటమి మరొక వైపు ఉన్నాయని అమిత్ షా తెలిపారు. రాహుల్ బాబాకు ఎజెండా లేదు, సిద్ధాంతం లేదని చెబుతూ  ఏ ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.  

రాహుల్ బాబా నేతృత్వంలో మహా కల్తీ కూటమికి నేత లేరని, నీతి కూడా లేదని ఆరోపించారు. అజెండా లేకుండా కేవలం అధికారం కోసం మాత్రమే కూటమి ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలవడం దేశానికి అత్యవసరమని స్పష్టం చేస్తూ రాహుల్ గాంధీ లాంటి నేతలకు పాకిస్తాన్, చైనా లాంటి దేశాలను ఎదుర్కోవడం చేతకాదని వెల్లడించారు. 

ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే సత్తా మోదీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ‘పుల్వామాలో ఉగ్రవాదుల దాడికి ప్రతికారం తీర్చుకున్నాం. దాడులకు ప్రతిగా మెరుపు దాడులు నిర్వహించాం. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్పాము. పాకిస్థాన్‌ను భయపడేలా చేశామని గుర్తు చేశారు. 

అసోంలో అధికారంలోకి రాగానే.. ఎన్నార్సీ అమలు చేసిన సంగతిని గుర్తు చేస్తూ ఎన్నార్సీ ద్వారా 40 లక్షల మంది అక్రమ చొరబాటుదారులను గుర్తించి, వారిని బయటకు పంపిస్తుంటే దేశ ప్రజల హక్కులను పట్టించుకోని రాహుల్ నేతృత్వంలోని మహాకూటమి చాల బాధపడుతోందని ఎద్దేవా చేశారు. వాళ్లేలా బతాకాలి. వారి హక్కలు ఏం కావాలంటూ బాధ పడుతున్నారని మండిపడ్డారు. మోదీ మళ్లీ అధికారంలోకి రాగానే.. దేశంలో ఉన్న అక్రమ చొరబాటుదారులందరినీ తరిమివేస్తామని ప్రకటించారు. 

55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కల్పించని మౌలిక వసతులు తాము కల్పించామని   చెప్పారు.  యువతకు ముద్ర రుణాలు, ప్రతి ఇంటికి కరెంట్ కనెక్షన్లు, ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లు, పేదలకు నాణ్యమైన చికిత్స అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్న విషయాన్ని ఆయన వివరించారు. కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారితే వాజ్‌పేయ్ చక్కదిద్దారని తెలిపారు.

 ప్రధానిగా మోదీ దేశ ఆర్థిక పరిస్థితిని మరింత చక్కదిద్దారని వెల్లడించారు. మోదీ పాలనలో ఈ ఐదేళ్లలోనే 50 కోట్ల మంది పేదలకు అందే విధంగా పథకాలు అమలు చేశామన్నారు. వ్వవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతులను ఆర్ధికంగా లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఏటా రూ. 6 వేలు అందిస్తున్నామని చెప్పారు.