ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి .. కన్నా డిమాండ్


ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. డేటా వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు గవర్నర్‌ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కన్నా మాట్లాడుతూ  డేటా విషయం ప్రజల సమస్య తెలిపారు.  ఐటీ గ్రిడ్ కంపెనీ దగ్గర ఏపీ ప్రజలు డేటా పెట్టడం ఎంత వరకు క్షేమమని నిలదీశారు.  

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని కన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ గ్రిడ్‌ అనే ఓ ప్రైవేటు కంపెనీ మీద ఫిర్యాదు చేస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఏపీ పోలీసులు హైదరాబాద్‌ దాకా ఎందుకు వచ్చారో అస్సలు అర్ధం కావడం లేదని విమర్శించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి మా దగ్గరే ఉన్నాడని టీడీపీ చెప్పడం సిగ్గుచేటన్నారు.

ఏపీ లో టీడీపీ, వైసీపీ డ్రామా కంపెనీల వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తూ నిష్పక్షపాతం గా విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందుకే సీబీఐ విచారణ జరపాలని గవర్నర్ ను కోరినట్లు కన్నా తెలిపారు.  చట్టం తన పని తాను చేసుకోనీయకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. తనతో పాటు ఏపీ బీజేపీ నేతలంతా గవర్నర్‌ను కలిసి ఏపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని తెలిపారు. 

ఈ డేటా చోరీ కేసు ఏపీ, తెలంగాణ సమస్య కాదని, 5 కోట్ల ఆంధ్రుల సమస్య అని వ్యాఖ్యానించారు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి కుట్రలు సాగుతున్నాయని, టీడీపీ నాయకులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.