ప్రధాని సమక్షంలో బీజేపీలోకి రెబెల్‌ ఎమ్మెల్యే.. ఖర్గేపై పోటీకి సై

రెండు రోజుల కిందట ఎమ్మెల్యే పదవికి, పార్టీకి  రాజీనామా చేసిన  కాంగ్రెస్‌ రెబెల్‌ నేత ఉమేశ్‌ జాదవ్‌ బుధవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేపై ఉమేశ్‌ జాదవ్‌ను పోటీకి దింపే అవకాశముందని బీజేపీ సంకేతాలు ఇచ్చింది. 

కలబురిగిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ సందర్భంగా బీజేపీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప, మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌, ఇతర పార్టీ నేతల సమక్షంలో ఆయన బిజెపి  కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, నరేంద్ర మోదీ మళ్లీ దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టేవిధంగా కలబురిగి ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. 

కర్ణాటకలో ఓటమి ఎరుగని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన ఖర్గేపై బరిలోకి దింపేందుకే ఉమేశ్‌ జాదవ్‌ను బీజేపీ పార్టీలో చేర్చుకున్నట్టు బిజెపి  వర్గాలు తెలిపాయి. గుల్బార్గా నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన ఖర్గే ఎన్నికల్లో ఎప్పుడూ ఓడిపోలేదు. ఈసారి ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అందుకే స్థానికంగా గట్టి పట్టున్న కాంగ్రెస్‌ రెబెల్‌ నేత ఉమేశ్‌ జాదవ్‌ను పార్టీలో చేర్చుకున్నట్టు బీజేపీ సీనియర్‌ నేతలు చెప్తున్నారు.

కాగా, బహిరంగ సభలో మాట్లాడుతూ కర్ణాటక ఇక్కడి ముఖ్యమంత్రి కుమార స్వామి కాంగ్రెస్‌ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని,  ఆయన రిమోట్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ చేతిలో ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.  అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకొంటున్నదని మండిపడ్డారు. 

"మేం నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే విపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రైతుల అభివృద్ధిని వాళ్లు అడ్డుకుంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని అన్నదాతలెప్పుడూ క్షమించరు. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ రైతులను మర్చిపోతుంది. ఈ విషయం ఇప్పటికి ఎన్నోసార్లు రుజువైంది" అని పేర్కొనాన్రు. రైతు పేరు చెప్పి ఓట్లేయించుకుని తర్వాత వారిని కాంగ్రెస్ అవమానిస్తుందని ధ్వజమెత్తారు. ఒక్కోసారి వారిపై కేసులు కూడా బనాయిస్తుందని విమర్శించారు.

 జాతీయ అంశాల్లోనూ ఆ పార్టీ విరుద్ధ వైఖరినే అవలంబిస్తోందని ప్రధాని తెలిపారు. "నేను ఉగ్రవాదాన్ని నియంత్రించాలని చూస్తుంటే వాళ్లు నన్నే తొలగించాలని చూస్తున్నారు" అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.