చంద్రబాబు సైబర్ నేరానికి పాల్పడ్డారు : జగన్

 డేటా వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు సైబర్‌ నేరానికి పాల్పడ్డారని ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్‌ క్రైమ్‌ జరగలేదేమో అని చెబుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారని పేర్కొంటూ  ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్‌ చేస్తున్నారని ఆరోపించారు. 

 ఎన్నికల సంఘం డేటా టిడిపికి  చెందిన సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చింది? అని ప్రభుత్వాన్ని ఆయన ఈ సందర్భంగా  ప్రశ్నించారు. ఈ విషయమై గవర్నర్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. 

 ‘‘దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సైబర్‌ నేరాలు జరగలేదేమో. ఇటీవల ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై దాడుల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తెదేపాకు సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తయారుచేసింది. ప్రజల ఆధార్‌ వివరాలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఎలా వచ్చాయి?ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఈ వివరాలు ఎలా వచ్చాయి? ఎవరికీ అందుబాటులో ఉండని మాస్టర్‌ కాపీ ఆ సంస్థకు ఎలా వచ్చింది? కేంద్ర ఎన్నికల సంఘం డేటా సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చింది? బ్యాంకు ఖాతా వివరాలు సేవామిత్ర యాప్‌లో కనిపిస్తున్నాయి. వారి వద్ద ప్రజల సమాచారం ఉంటే రేపు మోసాలు జరగవా?’’ అని జగన్‌ ప్రశ్నించారు.

‘‘టిడిపి నేతలు, కార్యకర్తలకు ఈ డేటా పంపించారు. ఆ ఓటరు ఎవరు? ఏ పార్టీ అభిమాని? అని తెదేపా శ్రేణులు వారిని ప్రశ్నించాయి. సర్వే పేరుతో గ్రామాలకు వెళ్లారు. ఓ పద్దతి ప్రకారం ఓట్లు తొలగించారు. రెండేళ్లుగా పథకం ప్రకారం ఈ పని చేశారు. సీఈసీ విడుదల చేసిన ఓటర్ల జాబితాను మేం పరిశీలించాం. 2014 ఎన్నికల్లో మేం ఓడిపోయింది కేవలం 5లక్షల ఓట్ల తేడాతోనే గనక జాగ్రత్తగా ఓటర్ల జాబితాను పరిశీలించాం. అప్పుడే డూప్లికేట్‌ ఓట్లు ఉన్నాయని గ్రహించి ఫిర్యాదు చేశాం. 24 పెన్‌డ్రైవ్‌ల్లో 59 లక్షల ఓట్లకు సంబంధించిన సమాచారం ఈసీకి అందజేశాం" అని జగన్ వివరించారు. 

వివిధ కేటగిరీల్లో 59 లక్షల ఓట్లు ఉన్నాయని కేసు పెట్టామని తెలుపుతూ నకిలీ ఓట్లు తొలగించాలని కోరుతూ ఫారం -7 కింద దరఖాస్తులు పెడుతున్నామని వెల్లడించారు.  ఓటు నమోదు, తొలగింపుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని చెబుతూ  అసలు తప్పు ఎక్కడ జరిగిందో ప్రశ్నించాలని పేర్కొన్నారు. ఇలాంటి పనులు చేసిన వారిపై కేసులు పెట్టేలా చూడాలని తాము గవర్నర్‌ను కోరినల్టు చెప్పారు. 

దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెడతారు. ఫొటోతో సహా వివరాలు చోరీ చేసి ఇవ్వడం నేరం. చేయకూడని పనులు చేసి ఏపీ -తెలంగాణ మధ్య వివాదాలు రేపుతున్నారని జగన్‌ ‌మండిపడ్డారు.