హిందూ ధర్మ పునః ప్రతిష్ట జరగాలి

సాధ్యమైనంత త్వరగా దేశంలో అందరి కృషితో హిందూ సమాజ జాగరణ,హిందూ ధర్మ పునః ప్రతిష్ట జరగాల్సిన అవసరం ఉందని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు సూచించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మూడు రోజులపాటు జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) జాతీయ స్థాయి సమన్వయ సమావేశాలని ప్రారంభిస్తూ భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే అత్యంత శ్రేష్ఠమైన దేశమని, సాధుసంతులు, మహానుభావుల పవిత్ర కార్యక్షేత్రమని తెలిపారు.

మన దేశమే విలువలు పాటించడంలో మొదటి స్థానంలో ఉంటుందని చెబుతూ పుణ్య క్షేత్రాలకు నెలవైన మన దేశం జగద్గురు స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో వైవిధ్యం ఉన్నా ఏకత్వం కనిపిస్తుందని చెప్పారు. తొలిరోజు వర్తమాన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, పర్యావరణ పరిస్థితులు, జల సంరక్షణ వంటి అంశాలపై చర్చించారు.

ఈ సమావేశాల్లో ధార్మిక, సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, జల సంరక్షణలో ఎదురవుతున్న సవాళ్లను చర్చించనున్నారు. ఆయా విభాగాలకు చెందిన వారందరూ ఈ చర్చల్లో పాల్గొంటారు.

ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ నేతృత్వంలో జరుగుతున్న సమన్వయ సమావే శాల్లో రాజకీయ విభాగమైన బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా ఏబీవీపీ, బీజేవైఎం, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సహా 32 విభాగాలకు చెందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. వీరితో పాటు కొందరు ప్రత్యేక ఆహ్వానితులు కూడా పాల్గొన్నారు. అమిత్ షా సహా ఆయా విభాగాలకు చెందిన బాధ్యులు తాము నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలను అందిస్తారు. అదే విధంగా నెలకొన్న సమస్యలను కూడా వివరిస్తారు.

కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌ సమన్వయ సమావేశాల్లో సంఘానికి సంబంధించిన నిర్ణయాలే తప్ప, ఎలాంటి రాజకీయ చర్చకు తావులేదని అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ అరుణ్‌కుమార్‌ స్పష్టం చేసారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ శుక్రవారం ఉదయం రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశం ఆద్యంతం గోప్యంగా జరిపారు.