నిజామాబాద్‌లో నేడు అమిత్ షా శంఖారావం

 తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని మోగిస్తోంది. రానున్న నెల రోజుల పాటు ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భారీ బహిరంగ సభలతో పాటు చిన్న చిన్న సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి సభ బుధవారం నిజామాబాద్‌లో జరగనుంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఓటర్లకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మధ్య తేడాను విడమరిచి చెప్పడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాత్ర స్వల్పంగా ఉంటుందని, బీజేపీకి ఓటు వేయడం ద్వారా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి, నరేంద్రమోదీ ప్రధాని కావడానికి దోహదం చేస్తుందనే ప్రచారాన్ని విస్తృతంగా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బూత్‌ల స్థాయిలో పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేసుకున్న బీజేపీ శక్తి కమిటీలను, మహిళా కమిటీలను కూడా నియమించింది. మరో పక్క మోర్చాలను, వివిధ విభాగాలకు ప్రత్యేక కమిటీలను కూడా నియమించింది.

టీఆర్‌ఎస్ అభ్యర్ధులకు ధీటైన అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది. దక్షిణభారతంలో తెలంగాణ నుండి తగు సంఖ్యలో  బీజేపీ అభ్యర్ధులు లోక్‌సభకు ఎన్నికయ్యేలా చూసేందుకు గత మూడేళ్ల నుండి అమిత్ షా ప్రత్యేక వ్యూహ రచన చేయడమేగాక, రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకులుగా గట్టివారిని నియమిస్తూ వచ్చారు. స్థానిక అంశాలు, టీఆర్‌ఎస్‌పై చెక్కుచెదరని అభిమానంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. 

కనీసం 10 స్థానాల్లో గెలుస్తామని భావించగా, ఒక్కస్థానంతోనే సరిపుచ్చుకోవల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన వ్యవస్థాగతమైన లోపాలను, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని లోక్‌సభ ఎన్నికలపై పార్టీ నేతలు దృష్టిసారించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిస్థితులను కూడా సమీక్షిస్తారు. అనంతరం జరిగే బహిరంగసభలో ప్రజలను ఉద్ధేశించి అమిత్ షా మాట్లాడతారు. 

ఈసారి ప్రధాని నరేంద్రమోదీ విజయాలనే ప్రధానంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ యోచిస్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌తో సురక్షిత హస్తాల్లోనే దేశం ఉందనే భరోసా కల్పించడం ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని పొందాలని బీజేపీ చూస్తోంది.