అసంఘటిత కార్మికులకు పెన్షన్ ప్రారంభించిన ప్రధాని

అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో పెన్షన్‌ అందించే ‘ప్రధానమంత్రి శ్రమ యోగి పెన్షన్‌’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో  ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  ‘ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజనను దేశంలోని 42 కోట్ల మంది కూలీలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. ఈ పథకం కూలీలు, వ్యవసాయ, కూలీలు, ఛాయ్‌వాలాలు, ఇళ్లలో పనిచేసేవారు వంటి అసంఘటిత కార్మికులకు ఓ బహుమానం అని చెప్పారు. 

"మీ వృద్ధాప్యంలో ఇది మీకు ఉపయోగపడుతుంది. అసంఘటిత కార్మికుల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు" అని వ్యాఖ్యానించారు. ఈ పథకంలో ప్రతి పేదవాడు చేరే అవకాశం ఉంది. ఇందులో విద్యావంతులు, విద్య రాని వారు అందరూ చేరవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండి, నెలకు రూ.15,000 కంటే తక్కువగా సంపాదిస్తున్న అసంఘటిత కార్మికులు ఈ పథక ప్రయోజనాలను పొందవచ్చు అని మోదీ తెలిపారు. 

కాగా, ఈ పథకానికి సంబంధించిన వివరాలను కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలో చేరేవారు ప్రతి నెల కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో చేరిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెల రూ.3000 పెన్షను అందుకోవచ్చు. ఈ పథకంలో త్వరగా చేరితే, తక్కువ ప్రీమియం కట్టే అవకాశం ఉంటుంది. 

18 ఏళ్ల వయసు ఉన్న వారు నెలకు రూ.55 చెల్లించాల్సి ఉంటుందని, 29 ఏళ్ల దాటిన వారు చేరితే నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని ఇటీవల కార్మిక శాఖ పలు వివరాలు తెలిపింది. జాతీయ పెన్షను పథకం, ఈఎస్‌ఐలో ఉన్న సభ్యులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారికి ఈ పథకంలో చేరే అవకాశం లేదు. ఫిబ్రవరీ 15 నుంచి అసంఘటిత రంగంలోని కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.