డేటా చౌర్యంతో ఏపీ ప్రభుత్వం పెద్ద నేరం

ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అందజేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద నేరానికి పాల్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్‌ స్కామ్‌పై ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమాచారాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. 

ఓటర్ల ప్రొఫైల్‌ సేకరించి డేటాను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.  ఈ డేటాతో చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నించారని ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికి తన బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.

డేటా చోరికి పాల్పడి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదని,  ప్రజల భద్రత, గోప్యతకు సంబంధించిన విషయమని పేర్నొన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలిని డిమాండ్ చేస్తూ లేకుంటే ప్రజస్వామ్యం అపహాస్యం అవుతుందని పేర్కొన్నారు.  ప్రభుత్వ ప్రయోజనాలకు పచ్చ చొక్కాలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు.

 దుర్మార్గులు రాజకీయాలు చేస్తే ఇలాంటి నేరాలే జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుచేసిన వారిని పట్టుకుంటే శభాష్‌ అనకుండా ఏపీ ప్రభుత్వం వింత ఆరోపణలు చేస్తుందని.. ఇది దొంగలు భుజాలు తడుముకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు