వివక్షపూరిత కుటుంభ చట్టాలపై దృష్టి

స్త్రీ-పురుష వ్యత్యాసాన్ని, వివక్షను కనబర్చే కుటుంబ చట్టాల సంస్కరణల చట్టాలపై దృష్టిసారించాలని లా కమీషన్ సూచించింది. వివాహ చట్టం, విడాకులు, మనోవర్తి, స్త్రీ-పురుషుల వివాహ వయస్సుకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేయాలని సూచించింది. లౌకికవాద ప్రజాస్వామ్యంలో మత స్వేచ్ఛను గట్టిగా పరిరక్షించాల్సిందేనని, అదే సమయంలో మతాచారాల పేరుతో ముమ్మారు తలాక్‌, బాల్యవివాహాలు వంటి సామాజిక రుగ్మతలను అనుమతించరాదని స్పష్టం చేసింది.

మహిళలకు సమానహక్కులపై  స్పందిస్తూ కుటుంబంలో మహిళల పాత్రను గుర్తించాలంది. విడాకులు తీసుకునే పక్షంలో ఆమె సంపాదనతో సంబంధం లేకుండా పెళ్లయిన తర్వాత సమకూర్చుకున్న ఆస్తిలో ‘సమానవాటా’ దక్కాలని అభిప్రాయపడింది. అయితే ఇక్కడ సమభాగమంటే ఆస్తిని నిక్కచ్చిగా సగం సగం చేసి పంచడమని కాదని, ఇలా చేస్తే చాలా కేసుల్లో దంపతుల్లో ఒకరిపై అన్యాయంగా భారం పడొచ్చని పేర్కొంది.

‘‘ఉమ్మడి పౌర స్మృతి అంశం విస్తృతమైనది. ఈ స్మృతితో రాగల పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు. దేశంలో వైరుద్ధ్యం లేకుండా చూడడమంటే అసలు వ్యత్యాసాలే లేకుండా చేయడం కాదు. అందుకే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలన్న అంశంపై కాకుండా వివక్షపూరితంగా ఉన్న చట్టాలపై దృష్టి పెట్టాం.’’ అని పేర్కొంది. మూడేళ్ల పదవీకాలాన్ని శుక్రవారంతో ముగించుకున్న 21వ న్యాయకమిషన్‌ ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదికను కాకుండా సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే బాధ్యత 22వ న్యాయకమిషన్‌పై పడింది.

ఈ కారణంగానే రెండేళ్లుగా పలువురితో సంప్రదింపులు జరిపి, వివరంగా పరిశోధించిన తర్వాత భారత్‌లో కుటుంబ చట్టాల సంస్కరణల ఆవసరంపై ఈ పత్రం సమర్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎస్‌.చౌహాన్‌ నేతృత్వంలోని న్యాయకమిషన్‌ పేర్కొన్నారు. ఈ మార్పుల కోసం హిందూ వివాహ చట్టం-1955, ప్రత్యేక వివాహ చట్టం-1954, పార్శీ వివాహ చట్టం, విడాకుల చట్టం(క్రైస్తవుల కోసం), ముస్లిం వివాహాల రద్దు చట్టాలల్లో సవరణ తీసుకురావచ్చని పేర్కొన్నది.

‘‘పెళ్లయిన తర్వాత చాలా మంది ఆడవాళ్లు కుటుంబం కోసం కెరియర్‌ను త్యాగం చేస్తారు. ఇంటిపనిలో ఎక్కువ భారం వారే మోస్తారు. అయినా ఆ పనిని డబ్బు రూపంలో కొలిచి చూడరు. ఆడవాళ్లు గర్భం దాల్చడంతో వారి కెరియర్‌కు అంతరాయం కలుగుతుంది. కానీ భర్తల కెరియర్‌పై ప్రభావం ఉండదు. అందుకే భార్య సంపాదించినా సంపాదించకపోయినా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. పెళ్లయిన తర్వాత కుటుంబానికి సమకూరే ఆదాయంలో ఆమెకూ సమాన వాటా ఇవ్వాలి.  దీనర్థం.. వారసత్వంగా వచ్చే ఆస్తికీ ఈ పంపకం వర్తిస్తుందని కాదు. అయితే వారసత్వంగా వచ్చే ఆస్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుని నిర్వహణఖర్చులను, మనోవర్తిని నిర్ణయించవచ్చు.’’ అని పేర్కొంది.

పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన చట్టబద్ధమైన కనీస వయోపరిమితి స్త్రీ-పురుషులిద్దరికీ సమానంగా ఉండాలని, ఇద్దరికీ 18 ఏళ్ల వయస్సునే నిర్ధారించాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వయోపరిమతి పురుషులకు 21 సంవత్సరాలు, మహిళలకు 18 ఏళ్లుగాను ఉంది. ఓటు హక్కు వయస్సు ఇద్దరికీ ఒకేలా ఉన్నప్పుడు, ప్రభుత్వాలను ఎన్నుకునే విచక్షణ వారికి ఉందని విశ్వసించినప్పుడు.. తమ జీవితభాగస్వాములను ఎంచుకునే సామర్థ్యమూ వారికి ఉంటుంది అని పేర్కొంది.

హిందూ వివాహ చట్టంలోని వైవాహిక హక్కుల్లో మార్పులు, అక్రమ సంతానానికి సమానహక్కులు వంటి అంశాలను చర్చించింది. ముస్లిం చట్టంలోని వారసత్వ హక్కుల గురించి చర్చించింది. ఈ నిబంధనలను క్రోడీకరించాలని సూచించింది. అయితే స్త్రీ-పురుష వ్యత్యాసం లేకుండా ఈ క్రోడీకరణ ఉండాలంది. పార్శీ మహిళలు అన్య వర్గాల వారిని పెళ్లి చేసుకున్నా వారికి వారసత్వ ఆస్తిపై హక్కులుండాలన్న అంశంపై, వితంతువుల హక్కులపై చర్చించింది.

బాలల న్యాయ (సంరక్షణ) చట్టాన్ని బలమైన లౌకిక చట్టంగా మార్చాలంది. అన్ని వర్గాల వారు పిల్లలను దత్తత తీసుకోవడానికి వీలు కల్పించేలా ఈ చట్టం ఉండాలని సూచించింది. దత్తతకు మార్గదర్శకాలను సవరించాలని చెప్పింది. పిల్లల సంరక్షణ విషయాలను నిర్ణయించేటప్పుడు మత చట్టాలతో సంబంధం లేకుండా వారి ప్రయోజనాలే పరమావధిగా ఉండాలని స్పష్టం చేసింది.

బహు భార్యాత్వం, నిఖా హలాలా, విడాకులు తీసుకునే పార్శీ మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చే అంశం, వివాహేతర సంబంధాలు తదితరఅంశాలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున వాటిపై న్యాయకమిషన్‌ పత్రంలో చర్చించినా వాటిల్లో కొన్నింటికి సమగ్ర మార్పులను సూచించలేదు.