తొలి స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ ఏపీ లోనే!

దేశంలోనే ప్రపధమంగా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీని ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రకటించారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ఎస్‌డీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీ హరిబాబు విశాఖలో ప్రారంభిస్తూ యువతలో ఉపాధికి అవసరమైన నైపుణ్యతను పెంచేందుకు వీలుగా కోర్సులు రావాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించిందని చెప్పారు. స్కిల్‌డెవలప్‌మెంట్ యూనివర్శిటీ ఏర్పాటు విశాఖలో అవసమైన 100 ఎకరాల భూమిని కోరుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలిపారు న్నారు. దీనికి అవసరమైన భూమిని కేటాయించేలా పరిశీలన చేయాల్సిందిగా ప్రభుత్వ కార్యదర్శి నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందాయని చెప్పారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దేశంలో నిరుద్యోగ సమస్యకు యువతలో సరైన వృత్తి నైపుణ్యత లేకపోవడమే కారణంగా గుర్తించిందని, దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌డీఐ)లను ఏర్పాటు చేసిందని తెలిపారు. టెన్త్, ఐటీఐ పాసైన విద్యార్థులకు వెల్డింగ్, ఫిట్టర్ వంటి ట్రేడుల్లో పూర్తి శిక్షణ ఇచ్చి వారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. వనితి ప్రొవైడర్స్ అనే సంస్థతో ఎస్‌డీఐ చేసుకున్న ఒప్పందం మేరకు భోగాపురం సమీపంలో శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పి యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారిలో 70 శాతం యువతకు నేరుగా ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను వనిత ప్రొవైడర్స్ సంస్థ తీసుకుంటుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థ, ఎస్‌డీఐ కలిసి యువతను విదేశాల్లో ఉద్యోగాలకు పంపుతాయని, దీనివల్ల వీసా, ఉద్యోగం తదితర అంశాల్లో ఎక్కడా తప్పిదాలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసమైన నిపుణులను తయారు చేసి సంస్థలకు మానవ వనరులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.