ఉగ్రవాద శిబిరాలపై దాడులకు వివరాలు ఎవ్వరి కోసం !

ఐటీవల పాకిస్తాన్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన బాంబుదాడులకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ మండిపడ్డారు. ఇదెంతమాత్రం అంగీకారయోగ్యం కాదని, దీనివల్ల శత్రుదేశాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. బాలాకోట్ దాడిపై రుజువులు అడగడమంటే మన భద్రతా దళాల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడమేనని ఆయన ధ్వజమెత్తారు. భద్రతాదళాలు, వాయుసేన చూపిన ధైర్యసాహసాలకు యావత్ భారతదేశం ఎంతో గర్విస్తోందని, ఎంతో తెగువ చూపిన మన వాయుసేన పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేశాయని పేర్కొన్నారు. అయితే విపక్షాలు వారి సాహసాన్ని గుర్తించకుండా వాటికి రుజువులు అడుగుతూ మన రక్షక దళాలను అవమానిస్తున్నాయని దుయ్యబట్టారు. దాడికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తే శత్రుదేశానికి లబ్ధి చేకూరుతుందే తప్ప మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని బుర్దవాన్ జిల్లా పర్యటనలో ఉన్న జావడేకర్ పార్టీ మేధావులతో జరిగిన సమావేశంలో పాల్గొంటూ ‘ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. అయితే మేము బహిర్గతం చేస్తే పాకిస్తాన్‌ను ఉపయోగపడుతుంది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో వాటిని వెల్లడించలేం’ అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలను ఎన్నడూ బహిర్గతం చేయరాదన్న కనీస మర్యాదను సైతం విపక్షాలు పాటించకుండా, దాడుల ఉదంతాన్ని సైతం రాజకీయం చేస్తూ తమ లబ్ధికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విపక్షాలపై దుమ్మెత్తిపోశారు. ఆర్మీ, వాయుసేన చర్యలకు దేశమంతా ఐక్యంగా మద్దతు తెలుపుతోందని, వారి సాహసాలను భేష్ అంటూ ప్రశంసిస్తోందని, అయితే విపక్షాలు మాత్రం ఏ విమానం దాడి చేసింది, ఎలా చేసింది? ఎన్ని బాంబులు విడిచారు? ఎంతమంది చనిపోయారు? లాంటి వివరాలు కావాలని డిమాండ్ చేస్తున్నాయని విస్మయం వ్యక్తం చేశారు. మీరు ఇలాంటి వివరాలను అడగటం ఎంతమాత్రం భావ్యం కాదని హితవు చెప్పారు. ఏ దేశంలోనూ ఇలాంటివి వెల్లడించరని చెప్పారు. ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబల్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం ఇలాంటి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేయడం శోచనీయమన్నారు. జవాన్ల త్యాగాన్ని తమ పార్టీ స్వప్రయోజనాలకు ఎన్నడూ వాడుకోదని కేంద్ర మంత్రి జావడేకర్ స్పష్టం చేశారు.