ఈ మెరుపు దాడులే చివరివి కావు.. మరిన్ని దాడులు

దాయాది దేశం పాకిస్థాన్‌పై భవిష్యత్తులో మరిన్ని మెరుపుదాడులకు అవకాశం ఉందంటూ ప్రధాని నరేంద్రమోదీ సంకేతాలిచ్చారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్‌లో ఇటీవల జరిగిన లక్షిత దాడులే చివరివి కావని స్పష్టం చేశారు. భారత్‌లో ఉగ్ర దాడులకు పాల్పడిన ముష్కరులు పాతాళంలో దాక్కున్నా వేటాడి చంపేస్తామని హెచ్చరించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను సోమవారం ప్రధాని ప్రారంభిస్తూ ప్రస్తుతం ఒక పని (మెరుపుదాడులు) పూర్తయింది. మా ప్రభుత్వం అప్పుడే నిద్రపోదు. రెండో దఫా దాడులకోసం మేం సన్నద్ధమవుతున్నాం. ఉగ్రవాదంపై పోరులో మేం వెనుకడుగు వేసే ప్రసక్తేలేదు. సమయం వచ్చినప్పుడు అతి పెద్ద, భయంకరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకడుగు వేయం అని స్పష్టం చేశారు. భద్రతా బలగాల పరాక్రమాన్ని సందేహించేలా విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఇక్కడి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్థాన్ వార్తా పత్రికల్లో హెడ్‌లైన్స్‌గా మారుతున్నాయి అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదుల ఏరివేతలో రాజీపడబోమని వెల్లడించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే బాలాకోట్ దాడులు చేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని స్పందిస్తూ..మేం ఎన్నికల్లో లబ్ధి కోసమే బాలాకోట్ దాడులు చేశామని ప్రతిపక్షాలు అంటున్నాయి. 2016 సెప్టెంబర్‌లో తొలి లక్షిత దాడులు చేసినప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయ్? భారత్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు పాతాళ లోతుల్లో దాక్కున్నా కూడా పట్టుకుని చంపేస్తాం. ఇదే మా సిద్ధాంతం అంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీచేశారు. 40 ఏండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదం కట్టడికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధాని ప్రశ్నించారు. కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ముంబై దాడులు, అహ్మదాబాద్ సివిల్ దవాఖానపై ఉగ్ర దాడుల్లో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు బాధ్యులైన వారిపై ప్రతీకార చర్యలు తీసుకునే బాధ్యత మాది కాదా? అని ప్రశ్నించారు. పాక్ వైమానిక దళాలతో పోరు సందర్భంగా భారత వాయుసేన వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే బాగుండేదంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడంపై నిప్పులు చెరిగారు. రాఫెల్ యుద్ధ విమానాలు సరైన సమయంలో వచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని మాత్రమే నేను చెప్పాను. అయితే, విపక్ష నేతలు మాత్రం నేను వైమానిక దళాల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు. ఈ విషయంలో ఇంగితజ్ఞానం ఉపయోగించాలంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. దయచేసి ఇంగితజ్ఞానం ఉపయోగించండి. ఫిబ్రవరి 27న పాక్‌తో జరిగిన గగనతల ఘర్షణ సమయంలో మన వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే మనం జెట్ ఫైటర్‌ను కోల్పోయి ఉండేవాళ్లం కాదు. అలాగే దాడి కోసం వచ్చిన శత్రుదేశానికి చెందిన యుద్ధ విమానం ఒక్కటి కూడా మిగిలి ఉండేది కాదని మాత్రమే నేను చెప్పాను. కానీ, నా మాటల్ని వాళ్లు (విపక్షాలు) అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. వారికి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప దేశం గురించి పట్టింపులేదు అని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకూ తమ పోరాటం ఆగదని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద వేర్లను పీకి పారేయడమే దీనికి పరిష్కారమని వెల్లడించారు.