ఉగ్రదాడితో భారత్ - పాక్ ద్వైపాక్షిక వాణిజ్యానికి బ్రేక్

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముష్కర మూకలను పెంచి పోషిస్తున్న పాక్‌తో ఇక వ్యాపార ప్రోత్సాహమే అక్కర్లేదనుకున్న భారత్.. ఆ దేశానికిచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) హోదాను వెనుకకు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దాయాదుల ద్వైపాక్షిక వాణిజ్యానికి బ్రేకులు పడ్డైట్లెంది. జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో చోటుచేసుకున్న ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులవగా, ఈ చర్యకు ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులనూ చేసిన సంగతి విదితమే. దీంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనగా, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) భారత్-పాక్ ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే దాదాపు 5 శాతం పెరిగింది. 1.069 బిలియన్ డాలర్ల నుంచి 1.122 బిలియన్ డాలర్లకు చేరింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్‌కు భారత ఎగుమతులు 1.84 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2016-17లో ఇవి 1.64 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇలా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యానికి పుల్వామా దాడి ఒక్కసారిగా బ్రేక్ వేసింది. ఎంఎఫ్‌ఎన్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. ఇతర దేశాలతో చక్కని స్నేహపూర్వక సంబంధాలను భారత్ కోరుకుంటున్నదన్నదానికి ఇది సూచిక. ఈ హోదాను పాకిస్థాన్‌కు 1996లో భారత్ ఇచ్చింది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు నామమాత్రమయ్యాయి. అయితే గత నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడితో 15న ఈ హోదాను వెనుకకు తీసుకుంటున్నట్లు భారత్ స్పష్టం చేసింది. అయితే ఈ సమాచారం అధికారికంగా మాకు అందలేదని పాకిస్థాన్ చెబుతున్నది. భారత్-పాక్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు చెడిపోవడం వల్ల పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం వాటిల్లనున్నది. పాక్‌కు భారత ఎగుమతుల వాటా.. మొత్తం దేశ ఎగుమతుల్లో అర శాతం కూడా లేదు. కానీ భారత్‌కు పాక్ చేస్తున్న ఎగుమతులు ఆ దేశ ఎగుమతుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎంఎఫ్‌ఎన్ హోదా దూరం కావడంతో ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులపై ఏకంగా 200 శాతం సుంకాలు పడనున్నాయి.