ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు నాబార్డ్ రూ రూ.1,145 కోట్ల ఋణం

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించింది. అందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన రుణ విధాన పత్రంలో రూ.1,145 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్షంగా నిర్దేశించుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 11,187 యూనిట్లకు ఆర్థికంగా సహకారాన్ని అందించనున్నట్లు పేర్కొంది. దీనిపై రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్‌కు నాబార్డు రుణం వ్యవసాయ,ఉద్యాన శాఖలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తున్నాయి. మహిళ స్వయం సహాయక గ్రూప్‌లకు ప్రాసెసింగ్ యూనిట్లలో భాగస్వామ్యం కల్పించనున్నారు. అలాగే ఇందులో ప్రైవేట్‌కు కూడా అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందులో భాగంగానే జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రుణ విధాన పత్రంలో రూ.1,145 కోట్లు ప్రతిపాదించామని నాబార్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తం వచ్చే ఏడాది 11,182 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రుణాలు ప్రతిపాదించారు. ఇందులో 667 ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, 899 డెయిరీ ప్రొడక్ట్ యూనిట్లు, 482 రైస్ మిల్లులు, 345 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు రుణాలు ఇవ్వాలని సూచించింది. వీటితోపాటు కాటన్ సీడ్ ఆయిల్ యూనిట్లు 22, దాల్ మిల్లులు 74, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు 180, మసాలా గ్రైండింగ్ యూనిట్లు 84, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు 14, వేప నూనె మిల్లులు 3 ఉన్నాయి. వీటన్నింటినీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, కోళ్లు, చేపలు వంటి వాటిని పంట కాలనీల ద్వారా నిర్దేశిత ప్రాంతాల నుంచి సేకరిస్తారు. ఈ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని నాబార్డు తెలిపింది. కాగా, వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నాబార్డు నివేదిక తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల యంత్రాల కొనుగోలుకు రూ.2,833 కోట్లు ప్రతిపాదించింది. ఇందులోట్రాక్టర్లు, పరికరాల కోసం రూ.1,987 కోట్లు కేటాయించింది. అలాగే 2,585 సెకండ్ హ్యాండ్ లేదా మినీ ట్రాక్టర్లకు రూ.79 కోట్లు రుణం ఇవ్వనున్నారు.