వాయుసేన మెరుపు దాడిలో 250 మందికి పైగా హతం

పాక్‌ భూభాగంలోని జైషే‌ మహమ్మద్‌‌ ఉగ్ర స్థావరాలను భారత వైమానిక దళం నేలమట్టం చేసిన ఘటనలో దాదాపు 250 మంది ఉగ్రవాదులు హతమైనట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. గుజరాత్‌లో జరగిన ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటూ ఈ ప్రకటన చేశారు. మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై ప్రతిపక్షాలు వివాదం లేవనెత్తడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మోదీ ప్రభుత్వం రెండు సార్లు ఉగ్రవాద దాడులకు ధీటైన జవాబును ప్రతి దాడులతో ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఉరీ ఘటన తరవాత మన భద్రతా బలగాలు పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి మెరుపు దాడులు నిర్వహించాయి. మన సైనికుల మరణానికి వారు ప్రతీకారం తీర్చుకున్నారని తెలిపారు. 

 పుల్వామా దాడి అనంతరం ఎలాంటి మెరుపుదాడులు ఉండవని ప్రజలు ఊహించారు. కానీ మోదీ నాయకత్వంలో కేవలం 13 రోజుల్లోనే వైమానిక దాడులు జరిపాం. ఈ దాడుల్లో 250 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. 

భద్రతా బలగాలపై జరిగిన దాడులపై ప్రతీకారం తీర్చుకున్న మూడో దేశంగా భారత్ నిలిచిందని ‌అమిత్‌ షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉగ్రదాడుల్లో మన జవాన్లు ప్రాణాలు కోల్పోయేవారు.. కానీ ఇప్పుడు పాక్‌ భూభాగంలోకి ప్రవేశించిన వింగ్‌ కమాండర్‌ను సైతం కేవలం 24 గంటల్లో వెనక్కి తీసుకురాగలిగాం. మోదీ వల్లే ఈ మార్పు సంభవించిందని స్పష్టం చేసారు. భారత వాయుసేన జరిపిన దాడిపై ఆధారాలు కోరడం పట్ల విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.