చంద్రబాబు మెడకు చుట్టుకోనున్న ఓటర్ల సమాచారం చోరీ !

హైదరాబాద్ లోని ఐటీగ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డేటా కుంభకోణం బయటికి పొక్కడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. సహనం కోల్పోయి కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో "కబడ్ధార్ కేసీఆర్" అంటూ మాట్లాడటం చూసాము. ఈ విషయమై తెలంగాణ పోలీసులు దర్యాప్తును ముమ్మరమ చేయడంతో అత్యవసరంగా ఆదివారం అమరావతిలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ భేటీ అయ్యారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు వస్తాయోనని సుదీర్ఘంగా చర్చించారు. `నోట్ కు వోట్' కేసు వలే ఇది మరో పెద్ద చిక్కు తెచ్చిపెట్టగలదని ఖంగారు పడుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్రా యాప్‌లో ఏపీ ఓటర్లకు సంబంధించిన సమాచారం ఉందంటూ సైబరాబాద్ పోలీసులకు వైఎస్సార్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదులుతున్నది. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా వివరాలను ఐటీగ్రిడ్‌కు అప్పచెప్పడంపై దుమారం రేగింది. దీంతో ముఖ్యమంత్రి హడావుడిగా న్యాయనిపుణలతో సంప్రదించారు. ప్రజల వ్యక్తిగత డేటాతో ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయినందున, అకౌంట్ల భద్రతపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కుంభకోణంలో వాస్తవాలు బయటపడితే మాత్రం పెను ప్రమాదం తప్పదని, ఈ వ్యవహారం దేశంలో సంచలనం సృష్టిస్తుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను ప్రైవేట్ ఐటీ సంస్థలకు కట్టబెడితే, భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు.

యాప్‌లో ఏపీ ప్రజలందరి సమాచారం ప్రత్యక్షం కావడంపై నమోదైన కేసులో సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తుచేస్తున్నారు.ఆదివారం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని శ్రీకృష్ణహైట్స్ ఐదో అంతస్థు లో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ విషయంలో పూర్తివివరాలు అందించాలని ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్‌కు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే పోలీసులు అక్కడ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని కీలక సమాచారాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో భద్రపరిచినట్లు భావిస్తుండటంతో దాన్ని డీకోడ్‌ చేసేందుకు నిపుణుల సహాయంతో ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఆ కీలక సమాచారం ఎలా చేరిందనే అంశంపైనా దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ సంస్థ సమకూర్చిందనే ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. 

దీంతో ఉలిక్కిపడ్డ ఐటీగ్రిడ్ యాజమాన్యం తమ డేటాను చోరీ చేయడంతో పాటు తమ ఉద్యోగులు నలుగురిని పోలీసులు అక్రమంగా నిర్భంధించారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఫిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి, నిర్భంధంలో ఉన్న నలుగురు వ్యక్తులను సోమవారం కోర్టు ముందు ఉంచాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించారు. పరస్పర ఫిర్యాదులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇలావుంటే, సేవామిత్రా కార్యాలయం వద్ద ఆదివారం తెలంగాణ పోలీసులు పహారా చేపట్టారు.

ఐటీగ్రిడ్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. మరోవైపు, సంస్థ ఎండీ భాస్కర్‌రావు శనివారం నుంచి కన్పించడంలేదంటూ గుంటూరులో కేసు నమోదైంది. దీంతో ఏపీ పోలీసులు భాస్కరరావును అప్పగించాలని సైబరాబాద్ పోలీసులను కోరారు. కేసు విచారణలో ఉన్నందున భాస్కరరావును అప్పగించడానికి వీల్లేదని సైబరాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు. ఇక, ఐటీగ్రిడ్ సీఈఓ అశోక్‌కు 161 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేస్తూ ఆదివారం సాయంత్రానికి సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని స్పష్టం చేశారు. అయితే, ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్టు అశోక్ పోలీస్ ఎదుట హాజరు కాలేదు.