రికార్డు స్థాయిలో 8.2 శాతంగా జీడీపీ వృద్ది

ఎన్నికల సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పెద్ద ఊతం ఇచ్చే విధంగా దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 8.2 శాతంగా నమోదైంది. స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు 8 శాతంగా నమోదైంది. గత నాలుగేళ్ల మోడీ పాలనలే ఇదే అత్యధిక వృద్ది రేట్ కావడం గమనార్హం.

రాయిటర్స్ నిర్వహించిన పోల్‌లో ఆర్థికవేత్తలు భారతదేశ జీడీపీ 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ అంచనాలు మించి అభివృద్ధి జరిగింది. ఇది రెండేళ్ళలో అత్యధిక వృద్ధి కావడం గమనార్హం.

గత 15 త్రైమాసికంలలో ఈ వృద్ది రేటు అత్యధికం కావడం గమనార్హం. ఉత్పత్తిదారులు, సరఫరాదారుల వైపు నుంచి ఆర్థిక కార్యకలాపాల పరిస్థితిని జీవీఏ వివరిస్తుంది. వినియోగదారులు లేదా గిరాకీ (డిమాండ్) వైపు నుంచి ఆర్థిక పరిస్థితిని వివరించేది జీడీపీ.

అంతకుముందు త్రైమాసికంలో జీడీపీ 7.7 శాతం నమోదైన సంగతి తెలిసిందే. 2017-18 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.59 శాతం మాత్రమే నమోదైంది. ఉత్పత్తిరంగం, వ్యవసాయ రంగంలలో వృద్ది రేటు గణనీయంగా పెరగడమే ఈ అత్యధిక వృద్దికి కారణంగా చెబుతున్నారు.  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధికి కారణం తయారీ రంగం 13.5 శాతం నమోదు కావడమని చెప్పవచ్చు.

ఈ వృద్ది రేట్ ను స్వాగతిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న వ్యవస్థాగత సంస్కరణలు, ఈ మధ్య తీసుకొంటున్న విధానపర చర్యల సానుకూల ఫలితాలే అందుకు కారణం అని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి చైర్మన్ డా. బిబెక్ దేబ్రోయ్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల వినియోగం, కనీస వస్తువులు, సేవలను ప్రజల అందరికి అందుబాటులో ఉంచేందుకు తీసుకొంటున్న వివిధ చర్యలు కుడా దోహదపడుతున్నట్లు తెలిపారు. ఈ చర్యల కారణంగా వృద్ది రేట్ పెరగటమే గాకుండా జీవన నాణ్యత కుడా పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు.

అంతర్జాతీయ ఆర్ధిక వాతావరణం అస్థిరంగా ఉన్నప్పటికీ, ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ భారత దేశం సుస్థిరమైన వృద్ది సాధించడం బలమైన మన ఆర్ధిక పునాదులే కారణమని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఉత్పతి రంగం, నిర్మాణ రంగంలలో వృద్ది రేట్ పెరగడం గమనిస్తే వృద్ది విస్తృత ప్రాతిపదికన ఉన్నట్లు వెల్లడి అవుతుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులు సహితం సానుకూలంగా ఉండగలవని ఆశాభావం వ్యక్తం చేస్తూ రానున్న త్రైమాసికాలలో వ్యవసాయ ఉత్పత్తులు, గ్రామీణ వినియోగం కుడా చెప్పుకోదగిన విధంగా పెరగ గలవని విశ్వాసం వ్యక్తం చేసారు.