తెలంగాణలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ షురూ !

అసెంబ్లీలో అనూహ్యమైన ఆధిక్యత ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభద్రతా భావానికి గురవుతున్నారా అనే అనుమానం కలుగుతున్నది. ఎన్నికల ఫలితాలు రాగానే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను పార్టీలో చేర్చుకొని, తమ ఎమ్యెల్యే బలాన్ని 88 నుండి 90కు పెంచుకున్నారు. ఇప్పుడు ఎమ్యెల్యేల నుండి ఎమ్యెల్సీల ఎన్నిక సందర్భంగా ప్రతిపక్షాల నుండి  ఆకర్షించు కోవడం కోసం గేట్లు తెరిచారు. దానితో కాంగ్రెస్ లో కలవరానికి గురవుతున్నది. 

ఇప్పటికే టిడిపి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి  టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. శనివారమే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు - ఆత్రం సక్కు, రేగా కాంతారావు అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దానితో ఖంగు తిని కాంగ్రెస్ అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తే మరో ఇద్దరు ఎమ్యెల్యేలు గైరాజరు అయ్యారు. వారు, రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి. ఇంకెంతమంది వెడతారో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఇప్పటికే శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుడు ఒక్కరు కూడా లేకుండా చేసుకో గలిగిన అధికార పక్షం, ఇప్పుడు ఒకరు గెలుపొందే అవకాశం ఉన్నా ఆ సీట్ కూడా కాంగ్రెస్ స్కు దక్కనీయ కుండా చేయాలనీ ఈ ఫిరాయింపులకు గేట్లు తెరిచింది 

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి మంత్రి పదవి ఇస్తే అధికార పార్టీలో చేరడం కోసం ఎదురు చూస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యఇప్పుడు టిడిపికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన మరుసటి రోజునే రాజీనామా చేయడం గమనార్హం. అందుకు అయన చెప్పిన కారణం  తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఆదరించే పరిస్థితి లేదని కావడం. అంటే తెలంగాణలో టిడిపి దుకాణం ఇక బంద్ అన్నట్లు సంకేతం ఇచ్చేసారు. 

ఈ పరిణామాలతో షాక్ కు గురైన కాంగ్రెస్ నేతలు సీఎల్పీ సమావేశం కాగానే నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంపూర్ణమైన మెజారిటీతో అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి ప్రమాణం చేసిందని, కానీ రాజ్యాంగాన్ని గౌరవించకుండా అనైనితంగా వ్యవహరిస్తోందని   గగ్గోలు పెట్టారు.