సిట్టింగ్‌లను మార్చకపోతే టీడీపీకి గడ్డుకాలమే

తెలుగు దేశం పార్టీ అధినేత అలవాటుకు భిన్నంగా ఈ పర్యాయం అభ్యర్థుల ఎంపికలో తీవ్రమైన వత్తిడులను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరుపుతూ, చాలావరకు అభ్యర్థులను  ఖరారు చేస్తున్నారు. వివాదం ఉన్నచోట్ల మాత్రం తర్వాత మాట్లాడతాను అంటూ వాయిదా వేస్తున్నారు. 

అయితే పలు నియోజకవర్గాలలో స్థానికంగా ప్రజల నుండే కాకుండా సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా వారిని మార్చడానికి జంకుతున్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా మార్చలేక పోతున్నారు. వారిలో కొందరికి కొడుకు నారా లోకేష్ తో గల అనుబంధమా, తన కుటుంభం సభ్యులు కొందరితో గల సంబంధాల లేదా ఇతరత్రా ఆర్ధిక వ్యవహారాల్లో తెలియడం లేదని తెలుగు దేశం పార్టీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 

సంచలనాల ప్రకటనలకు పేరొందిన అనంతపూర్ ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఈ విధాయమై నిర్మోహాటంగా బహిరంగంగా ముఖ్యమంత్రికి  హితవు చెప్పారు. 40 శాతం మంది ప్రస్తుత  ఎమ్యెల్యేలను మార్చని పక్షంలో వచ్చే ఎన్నికలలో గెలుపొందడం కాశమే అంటూ తేల్చేశారు. అయితే మార్చడానికి ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్నట్లు ఆయన మాట్లాడు కూడా వెల్లడి చేస్తున్నాయి. 

రాష్ట్రంలో దాదాపు 40 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని దివాకరరెడ్డి తేల్చి చెప్పారు. ఓ పక్క ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అహర్నిశలూ అభివృద్ధికి కృషి చేస్తుంటే మరోపక్క ఎమ్మెల్యేలు ఇదేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. 

చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, దీంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. అందువల్లే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందిని మార్చాలని పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. 

 తాడికొండ, వినుకొండ, నరసరావుపేట, తిరుపతి, పరుచూరు వంటి పలు చోట్ల స్థానిక పార్టీ నేతలు సిట్టింగ్ ఎమ్యెల్యేలపై బహిరంగంగానే విమర్శలు కురిపిస్తున్నారు. కానీ వారెవ్వరిని మార్చడానికి ముఖ్యమంత్రి సుముఖంగా లేరు.