రష్యా, చైనా ఆయుధాలతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

రష్యా, చైనాల నుండి ఆయుధాలు సేకరించి, మోడీ ప్రభుత్వాన్ని కుల్చేందుకు మావోలు కుట్ర పన్నిన్నట్లు తమవద్ద నిర్దుష్టమైన ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీస్ లు సపష్టం చేస్తున్నారు. ఐదుగురు హక్కుల ఉద్యమకారులను అరెస్ట్ చేయడంపై దేశ వ్యాప్తంగా చెలరేగిన అలజడిని ప్రస్తావిస్తూ మవోలతో వారికి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.

భీమా-కొరెగావ్ హింసాత్మక సంఘటనల కేసులో అరెస్టయినవారిపై ఆరోపణలను రుజువు చేయగలిగే సాక్ష్యాధారాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీస్ శాంతి బాధ్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలు అరెస్టయిన ఐదుగురికి, మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు స్పష్టంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు.

భీమా - కొరెగావ్ హింసాత్మక సంఘటనలు జనవరిలో జరిగాయి. అప్పటి నుంచి జరుగుతున్న దర్యాప్తు వివరాలను సింగ్ వివరించారు. 2017 డిసెంబరు 31న విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు ఈ ఏడాది జనవరి 8న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాదాపు నిందితులంతా కబీర్ కళా మంచ్‌కు చెందినవారేనని చెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో మావోయిస్టు సంస్థల కుట్ర బయటపడిందని తెలిపారు. దీనిలో ఓ ఉగ్రవాద సంస్థ కూడా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న సుధ భరద్వాజ్, గౌతమ్ నవలఖ, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెస్, పి వరవరరావులపై కచ్చితమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.

మావోయిస్టులు భారీ కుట్ర పన్నుతున్నట్లు, వారికి ప్రస్తుతం అరెస్టయిన ఐదుగురు సహకరిస్తున్నట్లు స్పష్టంగా వెల్లడైందని చెప్పారు. తమ దర్యాప్తులో పాస్‌వర్డ్‌ రక్షణ కల హార్డ్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నామని, దీనిలో కీలక సాక్ష్యాధారాలు లభించాయని పీ బీ సింగ్ తెలిపారు. సీపీఐ మావోయిస్టు సభ్యులతో వీరు జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలు దీనిలో ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు ఆరోపించారు.  

 అరెస్టు అయిన నిందితులు పారిస్‌లోనూ స‌మావేశం అయ్యారని, అక్క‌డ నుంచే నిధులు అందుతున్నాయని తీవ్రమైన ఆరోపణ చేసారు. గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురి మధ్య జరిగిన ఉత్తర, ప్రత్యుత్తరాలనుబట్టి మోదీ పాలనను అంతం చేయడానికి మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య తరహాలో మరో దారుణానికి తెగబడేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.