సాయుధ బలగాలకు అండగా ఉండండి, ఉగ్రవాదులకు కాదు !

తనను విమర్శించే స్వేచ్ఛ విపక్ష నేతలకు ఉన్నదని, అయితే ఆ విమర్శలు మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులకు ఉపయోగపడకూడదని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ హితవు చెప్పారు. కొంత మంది వ్యక్తులు తమ సొంత దేశాన్నే వ్యతిరేకిస్తున్నారని అంటూ మన దేశం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటని చెప్పారు. 

ఢిల్లీలో ఆయన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరుపడం పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాన మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల యావత్తు దేశం ఆవేదన చెందుతున్నదని తెలుపుతూ ఆ విమానాలు మన వద్ద ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం దేశమంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్న మాట ఇదే అని చెబుతూ రాఫెల్ విమానాల విషయమై గతంలోనూ ఇప్పుడు కొనసాగుతున్న స్వార్థ రాజకీయాల వల్ల దేశం చాలా నష్టపోయింది మండిపడ్డారు. 

ఇప్పుడు మన దేశమంతా సాయుధ బలగాలకు అండగా నిలిచినా కొన్ని పార్టీలు మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను శంకిస్తున్నాయని ప్రధాని దుయ్యబట్టారు. ఈ పార్టీల ప్రకటనలు, వ్యాసాలను భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉపయోగించుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేసారు.  మోదీని విమర్శించే క్రమంలో ఈ పార్టీలు సొంత దేశాన్ని, దేశ ప్రయోజనాలను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మన సాయుధ బలగాలను విశ్వసిస్తారా లేక శంకిస్తారా అని ఈ పార్టీల నాయకులను ప్రశ్నించారు. 

ప్రభుత్వ పనితీరులో లోపాలను ఎత్తిచూపుతూ మోదీని విమర్శించే స్వేచ్ఛ ఈ నాయకులకు ఉన్నది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారికి తోడ్పడకూడదని స్పష్టం చేశారు. మోదీని విమర్శించాలని వారు అనుకుంటే విమర్శించవచ్చని,  కానీ దేశ ప్రయోజనాలను వ్యతిరేకించకూడదని స్పష్టం చేయారు. 

భారత్ ఐక్యత చూసి భయపడుతున్నారు 

భారత్ ఐక్యతను చూసి దేశం లోపల, వెలుపల చాలామంది భయపడుతున్నారని ప్రధాని పేర్కొంటూ 21వ శతాబ్దం భారత్‌దేనని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రక్షణ రంగంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని పేర్కొంటూ ఎన్నో ఏండ్లు దేశాన్ని పాలించిన వారు ఒప్పందాలు, ముడుపులపైనే ఆసక్తి చూపారని ప్రధాని ధ్వజమెత్తారు. జీపులతో మొదలైన వారి కుంభకోణాలు ఆ తర్వాత ఆయుధాలు, జలాంతర్గాములు, హెలికాప్టర్ల వరకు విస్తరించాయి. ఈ క్రమంలో రక్షణ రంగం చాలా నష్టపోయిందని చెబుతూ ఈ విషయం దేశమంతటికీ తెలుసు అని నిప్పులు చెరిగారు. 

తన హయాంలో 2.3 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను కొనుగోలు చేశామని పేర్కొంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు 2009 నుంచి ఈ ప్రతిపాదనను పట్టించుకోదని గుర్తు చేశారు. మా హయాంలో అధికారులకు మధ్యవర్తుల నుంచి విముక్తి కల్పించామని చెబుతూ ఈ ప్రభుత్వం అవినీతిని సహించదని వారికి తెలుసు అని మోదీ పేర్కొన్నారు. ప్రతి జవాను ప్రాణం తమకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. శత్రు సేనలను చీల్చి చెండాడి పాక్ నుంచి భారత్‌కు తిరిగివచ్చిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలను చూసి పాక్ భయపడుతున్నదని, ఇది మంచిదేనని కొనియాడారు.