బలమైన ఆర్ధిక దేశంగా భారత్ ఎదుగుతుంది


ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక దేశంగా భారత్ ఎదుగుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కేజే. ఆల్ఫోన్స్ తెలిపారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్ నిలిచిందన్నాని చెబుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన పురోగతి సాధించామని తెలిపారు. అనంతపూర్ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ  రానున్న ఎన్నికల్లో దేశానికి నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. మోదీనే తిరిగి ప్రధానిగా ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

గత ప్రభుత్వాల హయాంలో విచ్చలవిడిగా అవినీతి ఉండేదని, మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అవినీతిని నిర్మూలించేందుకు పెద్దపీట వేశారని, తద్వారా నాలుగున్నరేళ్లలో దేశం అవినీతి తగ్గిపోయిందని పేర్కొన్నారు. సంస్కరణల్లో భాగంగా జీఎస్‌టీ, స్వచ్ఛ భారత్, ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ల మంజూరు, జన్‌ధన్ ఖాతాలు, బడుగు, బలహీన వర్గాలకు పక్కాగృహాల నిర్మాణం వంటివి సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు.

 ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష అని, ఆ మేరకు ఇప్పటికే 35 కోట్ల జన్‌ధన్ ఖాతాలు జీరో బ్యాలెన్స్‌తో తెరిచారని తెలిపారు. వీటి వల్ల ఉపయోగం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, ట్టయితే ఈ ఖాతాల ద్వారా రూ.6 లక్షల 5 వేల కోట్ల సంక్షేమ పథకాల సొమ్ము నేరుగా బదిలీ చేశామని గుర్తు చేశారు. దేశంలో 2.6 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని, ఈ నెలాఖరులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే 8 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్ల ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్ మహా గఢ్‌బంధన్‌లో పార్టీల భావజాలానికి ఎక్కడా పొంతన లేదని, పరస్పర వైరుధ్య భావాలున్న వాళ్లందరూ ప్రధాని మోదీని గద్దె దింపాలన్న ఉద్దేశంతోనే ఎన్నికలకు ఆరు నెలలు ముందు ఒక్కటయ్యారని కేంద్ర మంత్రి విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రాధాన్యత దానికుందని చెబుతూ  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అవసరమైన సాయం చేశామని తెలిపారు. 

బ్యాంకు రుణాలు పొంది దివాళా తీసే బడా వ్యాపారవేత్తలు ఎవరినీ వదిలిపెట్టేది లేదని, దివాళాకోరులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.  2020 నాటికి అందరికీ ఇళ్లు కట్టిస్తామని చెబుతూ ఇప్పటికే 1.3 కోట్లు కట్టించామన్నారు. రాష్ట్రానికి నరేగా నిధులు 22 వేల కోట్లు, 12 లక్షల ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చినందుకు ప్రధానికి రాష్ట్ర పర్యటనకు రాకూడదా అని మంత్రి ప్రశ్నించారు.