హై కోర్ట్ విభజనపై ఎపి ప్రభుత్వానికి నోటిస్

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు విభజన ఇక ఎంతమాత్రం జాప్యం కావడానికి వీలులేదని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, విభజన జరగాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌లు వాదించారు.

తెలుగురాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుత లేదా హైదరాబాద్‌లోని మరేదైనా భవనంలో వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎందుకు హైకోర్టులను ఏర్పాటు చేయకూడదని కేంద్రం ఈ పిటిషన్‌లో పేర్కొంది. 2015 మే1న హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరింది.

ఏపీలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపీకి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని, లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేంద్రం వాదనలతో తెలంగాణ ఏకీభవించింది. చట్టసభలు, అధికారుల విభన జరిగిందని.. కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు విన్నవించారు. కేసు వాదనల సమయంలో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది.