ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. మోదీ భరోసా

ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. విశాఖలో బీజేపీ జరిపిన  ప్రజా చైతన్య సభలో మాట్లాడుతూ  విశాఖ నగరాన్ని చూసి మనసు పులకరిస్తోందని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, తెన్నేటి లాంటి వ్యక్తులు తిరిగిన భూమి విశాఖ అని చెప్పారు. 

మొదటగానీ ఏపీ ప్రజల చిరకాల వాంఛ రైల్వోజోన్‌ను సాకారం చేశామని తెలుపుతూ ప్రసంగం ప్రారంభించారు. ఏపీ అభివృద్ధికి దోహదపడే విధంగా రైల్వోజోన్‌ను ఇచ్చామని తెలిపారు. అయితే  ఏపీ ప్రజల అభవృద్ధికి ఆటంకం కలిగిస్తూ.. స్వలాభం కోసం ఆలోచించేవాళ్లే అధికారంలో ఉన్నారని మోదీ దుయ్యబట్టారు.  

మాకు ఎలాంటి భయాలు ఆందోళనలు లేవు. దురుద్దేశాలతో రాజకీయాలు చేసేవాళ్లే భయపడతారు. ఇప్పుడు ఏపీలో భయపడుతోంది మా ప్రత్యర్థులే. ఏపీ కోసం మోదీ ఏం ఇస్తానని చెప్పారో అవన్నీ ఇచ్చారని ఒప్పుకుంటే వారికి రాజకీయంగా పుట్టగతులుండవు. అందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా మండిపడ్డారు. 

ఆత్మగౌరవం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని చెబుతూ వారి ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తెస్తున్నామని చెబుతూ అందుకే రాజకీయ దళారులు, అవకాశ వాదులు కూటమి పేరుతో ఏకమవుతున్నారని ఆరోపించారు. 

విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత విస్తరిస్తున్నామని చెబుతూ అనేక కార్యక్రమాల ద్వారా నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తున్నామని మోదీ వివరించారు. ఐఐఎం, పెట్రోలియం కాంప్లెక్స్‌, లాజిస్టిక్స్‌ హబ్‌ తీసుకొచ్చామన్నారు. విశాఖ రిఫైనరీ ఆధునీకీకరణ పనులు చేపట్టామని ఆయన చెప్పారు.  

‘‘ఇక్కడి నేతలు ప్రతిసారీ యూ టర్న్‌ తీసుకుంటున్నారు. ఈ నేతలు రాష్ట్రాభివృద్ధికి ఏం చేస్తున్నారు? అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే నన్ను తిడుతున్నారు. ఇక్కడి నేతలు ఎలాంటి వారితో కూటమి కట్టారో ప్రజలు గ్రహించాలి" అంటూ టిడిపి పాలనను ఎండగట్టారు. 

పలుసార్లు మాట మార్చే నేతల వైఖరిని గమనించాలని ప్రజలను కోరారు. కూటమి కట్టిన నేతలకు ఎలాంటి అజెండా లేదని ధ్వజమెత్తుతూ. నల్లధనం దాచుకున్న వారిపై చర్యలు తీసుకోవడమే వీరి బాధకు కారణమని ఎద్దేవా చేశారు.

 దిల్లీలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుందని, కానీ  భావసారూప్యత లేని పార్టీలన్నీ కూటమి కట్టాయని గుర్తు చేశారు.  కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. బలమైన ప్రభుత్వంతోనే రైతులు, జవాన్లు బాగుంటారని మోడీ పేర్కొన్నారు.