అభినందన్‌ను చూసి జాతి గర్విస్తోంది: మోదీ

తమిళనాడుకు చెందిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తోందని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ అన్నారు. మొదటి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తమిళనాడుకు చెందనవారేనని ప్రధాని గుర్తుచేశారు. గత రెండ్రోజులుగా పాక్ కస్టడీలో ఉన్న అభినందన్‌ గురించి ప్రధాని మోదీ నేరుగా మాట్లాడటం ఇదే మొదటిసారి.  తమిళనాడులో కన్యాకుమారి పట్టణంలో శుక్రవారం జరిగిన బీజేపీ ర్యాలీలో మోదీ పాల్గొంటూ అభినందన్‌ సాహసం, మొక్కవోని ధైర్యాన్ని ప్రధాని ప్రశంసించారు.  

మధురై-చెన్నై మధ్య నడిచే వేగవంతమైన రైలు తేజస్‌ చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైంది. మేకిన్‌ ఇండియాకు ఇదొక గొప్ప ఉదాహరణ. అత్యాధునిక రైళ్లను మన దేశంలోనే తయారు చేయడం దేశానికే గర్వకారణం అని మోదీ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు నిజాయతీ గల నేతలను కోరుకుంటున్నారు.. వారసత్వ రాజకీయాలను కాదని ఆయన అన్నారు. ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తుంటే భారత్‌ ఇక నిస్సహాయంగా చూస్తూ ఉండబోదని ఆయన హెచ్చరించారు. పుల్వామా ఘటనలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్న సైనికులకు మోదీ సెల్యూట్‌ చేశారు.

భారతదేశం చాలాకాలంగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని, ఇంకెంతమాత్రం ఉపేక్షించేలేది లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాద బాధ్యులను శిక్షించాలని దేశం యావత్తూ నినదించడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. 

 'ముంబై దాడి జరిగింది. అయితే ఉగ్రదాడికి వ్యతిరేకంగా జరిగిందేమీ లేదు. ఉరి దాడి జరిగినప్పుడు మేము ఏమి చేశామో మీరు చూశారు. పుల్వామా దాడి జరిగినప్పుడు మన సాహస సైనికులు ఏం చేశారో కూడా చూశారు. ఐఏఎఫ్ చర్య తీసుకోవాలని కోరినప్పుడు యూపీఏ ప్రభుత్వం వారిని ఏమీ చేయనీయలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. సాయుధ బలగాలకు మేము పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అది కూడా వార్తల్లో చూశాం. అదే న్యూ ఇండియా అంటే..' అని మోదీ పేర్కొన్నారు.    

ఉరీ దాడి జరిగిన తర్వాత ముష్కరులపై భారత సైన్యం ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందో అందరూ చూశారుని చెబుతూ  తాజాగా పుల్వామా దాడికి వైమానిక దళాలు గట్టి బదులిచ్చాయిని చెప్పారు.