11 మందికి కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత 24 గంటల్లో  పోలీసులతో పాటు వారి కుటుంబాలకు చెందిన 11 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడి చేసి పోలీసుల కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారు. దీంతో జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు తమపై ఒత్తిడి ఇటువంటి వ్యూహాలను అనుసరిస్తున్నారని బద్రతా అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు అపహరణకు గురైన వారి కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.

దక్షిణ కశ్మీర్‌‌లోని షోపియాన్‌, కుల్గాం, అనంతనాగ్, అవంతిపుర జిల్లాల్లో గురువారం రాత్రి వరకూ జవాన్ల కుటుంబాలే లక్ష్యంగా ఈ అపహరణలు సాగాయి. అపహరించుకు వెళ్లిన వారిలో పోలీసు అధికారి కుమారులతో పాటు వారి సోదరులు కూడా ఉన్నారు. . తొలుత ఉగ్రవాదులు పుల్వామా జిల్లాలో ఓ పోలీసును కిడ్నాప్ చేసి విచారించారు. ఆ తర్వాత అతన్ని చితకబాది వదిలేశారని అధికారులు తెలిపారు.

పుల్వామాతో పాటు అనంతనాగ్, కుల్గామ్ జిల్లాల్లోనూ ఈ కిడ్నాప్‌లు కొనసాగాయన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో పనిచేస్తున్న మరో ఇద్దర్ని కూడా ఉగ్రవాదులు అపహరించినట్లు సమాచారం. అంతేకాక త్రాల్ సెక్టర్‌లో ఓ పోలీసు ఆఫీసర్ కుమారున్ని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. దాంతో ఆ కుటుంబసభ్యలు తమ కొడుకును వదిలేయాలని ఉగ్రవాదులను వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు కశ్మీర్‌లో ఉగ్రవాదులు.. పోలీసుల కుటుంబీకులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బందిపోరా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నిన్న ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే  షోపియాన్‌ జిల్లాలో ఇటీవల ఉగ్రవాదుల దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు.