ప్రధాని మోదీ పర్యటనకు విశాఖ ముస్తాబు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు విశాఖపట్నం ముస్తాబైనది. ఆయన ప్రధాని హోదాలో విశాఖ రావడం ఇది రెండోసారి. 2014 అక్టోబర్‌లో హుద్‌హుద్‌ తుపాను అనంతరం నష్టతీవ్రతను తెలుసుకునేందుకు తొలిసారిగా నగరానికి వచ్చారు. అంతకుముందు 2014 ఎన్నికల ప్రచారసభలో ప్రధాని అభ్యర్థిగా పాల్గొన్నారు. 

మరో వారం, పది రోజులలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండడం, దేశం సరిహద్దులలో యుద్ధ వాతావరణం నెలకొనడం, పాకిస్థాన్ లోకి చొచ్చుకుపోయి మన వాయుసేన ఉగ్ర శిబిరాలను ధ్వసం చేసి ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరచడం వంటి సంఘటనల నడుమ జరుగుతున్న బహిరంగ సభపై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాలంగా కోరుకొంటున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం ప్రధాని రావడంతో ఆసక్తి కలిగిస్తున్నది. 

ఏపీ బీజేపీ నేతలు అందరు కొద్దీ రోజులుగా ఇక్కడనే దృష్టి కేంద్రీకరిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే విధంగా భారీ సన్నాహాలు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రధాని సభ నిర్వహించనున్నారు. ధానికి స్వాగతం పలుకుతూ నగరంలో ప్రతిచోట హోర్డింగ్‌లు వెలుస్తున్నాయి. రైల్వేజోన్ ప్రకటన, పాకిస్తాన్‌పై దాడులతో బీజెపీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 

మొదట్లో ప్రధాని మోదీ ప్రజాచైతన్య సభను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే పలుసార్లు తెలుగు దేశం పార్టీ సభలు జరిగిన ఈ మైదానం  ప్రధాని సభకు  ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించలేదంటూ ఏయూ అధికారులు తిరస్కరించారు. దీంతో ఈ సభను రైల్వే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. 

కాగా ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి నేరుగా సాయంత్రం 6.20 గంటలకు విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 6.45 గంటలకు నగరంలో సభ జరిగే రైల్వే గ్రౌండ్స్‌కు వస్తారు. 6.55కి వేదికపైకి చేరుకుంటారు. 7 గంటలకు విశాఖ ఎంపీ కె.హరిబాబు, 7.10కి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రసంగం ఉంటాయి. రాత్రి 7.20 నుంచి 8 గంటల వరకు 40 నిమిషాల సేపు సభనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. 8.05 గంటలకు రైల్వే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ నుంచి విమానాశ్రయానికి బయలుదేరతారు. 8.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమవుతారు.

ఇప్పటికే సభా ప్రాంతాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని భద్రతను పది మంది ఎస్పీ ర్యాంకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో ప్రధానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి సభా ప్రాంగణం వరకు వచ్చే కాన్వాయ్‌లో 20 బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు అనుసరిస్తాయి. ప్రధానమంత్రి కోసం ప్రత్యేకంగా ఒక బులెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని ఢిల్లీ నుంచి రప్పిస్తున్నారు.

రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ విశాఖ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు.  బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్, సహ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌లతో పాటు ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్ తదితరులు  గురువారం సాయంత్రం పరిశీలించారు.