అమేథిలో ఈసారి బీజేపీదే విజయం.. యోగి ధీమా

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేథి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తం చేశారు. తాము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తమ పార్టీ కార్యకర్తల పరిశ్రమ తమను గెలిపిస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అమేథిలో పర్యటించనున్న సందర్భంగా ప్రధాన పర్యటనకు ఏర్పాట్లను సమీక్షించడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ బీజేపీ అమేథిలో నెగ్గడం ద్వారా చరిత్రను పునరావృతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

‘1998లో మేము అమేథి సీటును గెలుచుకున్నాం. ఆ తరువాత మళ్లీ ఆ సీటును గెలవలేకపోయాం. దీనికి నేను విచారిస్తున్నాను. ఇప్పుడు కార్యకర్తల అంకితభావం, పరిశ్రమ కారణంగా ఈ సీటును గెలవబోతున్నాం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర లేదు’ అని ఆయన ప్రకటించారు. 

మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ఆదిత్యనాథ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని మోదీ ఆదివారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. 

మోదీ మధ్యాహ్నం రెండు గంటలకు అమేథికి చేరుకుంటారని సీఎం చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాలు, చేసిన పనులను వెల్లడించేలా ప్రతి గ్రామంలో కనీసం ఒక్కో బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.