కృతజ్ఞతా భావం లేని టీడీపీ నేతలు : కన్నా


ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా, నేతల విజ్ఞప్తుల మేరకు ప్రత్యేక రైల్వే జోన్ బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తే కనీసం కృతజ్ఞత తెలిపే సంస్కృతి టీడీపీ నేతలకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించిందని చెబుతూ  రైల్వేజోన్‌ను ప్రకటించడంపై కన్నా హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు. రైల్వేజోన్‌పై విధి విధానాలు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదని తెలిపారు. 

ఉగ్రవాదులు  భారత సైన్యస్థావరాలపై దాడిచేయడాన్ని విజయవంతగా ప్రతిఘటించి, ఉగ్రవాదులపై సవాల్ విసురుతూ మెరుపు దాడులకు దిగి వారి స్థావరాలను ధ్వంసం చేయించిన వీరుడు మోదీ అని కొనియాడారు. ముందుగానే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్థాన్‌కు హెచ్చరించి 200మంది తీవ్రవాదులను మట్టుపెట్టించిన నాయకుడు మోదీ అని పేర్కొన్నారు. 

 అర్బన్ హౌసింగ్ పథకం కింద ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ఇళ్లు ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు మంజూరుచేసినట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుతోవ పట్టించడానికే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కడప స్టీల్‌ప్లాంట్, దుగ్గురాజపట్నం పోర్ట్‌ల నిర్మాణం కొన్ని సాంకేతిక కారణాల వలన మంజూరు చేయలేదని చెబుతూ అందుకు కూడా చంద్రబాబే కారణమని పేర్కొన్నారు.  

ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక భాగం విశాఖ రైల్వేజోన్‌ పరిధిలోనే ఉంటుందని, దీనిపై సందేహాలు అవసరం లేదని విశాఖ ఎంపీ డాక్టర్‌ కె.హరిబాబు పేర్కొన్నారు. నూతన రైల్వేజోన్‌కు సాంకేతికాంశాలను ఖరారు చేసేందుకు రైల్వే ఉన్నతాధికారులు జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారిని ఒ.ఎస్‌.డి.గా నియమించబోతున్నారని, త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.