రాజ్యసభ ఉపసభాపతిగా ఎన్డీయే అభ్యర్థి ఎన్నిక

ఎంతో ఉత్కంఠత రేపిన రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలో ఎన్డీయేనే అభ్యర్థి విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన జేడీయూ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రతిపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ ని 20 ఓట్ల తేడాతో ఓడించారు. మొత్తం 230 మంది సభ్యులు ఓటు వేయగా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌కు 125 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ పూర్తయిన అనంతరం హరివంశ్ విజయం సాధించినట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో ఎన్డీయే అభ్యర్థి విజయానికి మార్గం సుగమమైంది. ఇద్దరు సభ్యులు సభకు వచ్చి, ఓటు వేయకుండా తటస్థ వైఖరిని అవలంభించారు.

టీడీపీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు ఓటేశారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించిన టీఆర్ఎస్ సభ్యులు ఆఖరి క్షణంలో మనసు మార్చుకుని ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేశారు. ప్రతిపక్షాల అభ్యర్ధికి వోట్ వేస్తామని ప్రకటించిన వైసిపి సభ్యులు ఇద్దరు వోటింగ్ లో పాల్గొనలేదు. వోటింగ్ కు దూరంగా ఉంటామని ముందుగా సంకేతం ఇచ్చిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు శివసేన, అకాలీదళ్ వోటింగ్ లో పాలగోనటమే కాకుండా ఎన్డీయే అభ్యర్ధికి వోట్ వేసాయి. అట్లాగే వోటింగ్ కు దూరంగా ఉంటారని భావించిన బిజెడి సభ్యులు ఎన్డీయే అభ్యర్ధికి వోట్ వేశారు. చాలాకాలంగా ఏకగ్రీవంగా జరుగుతున్న ఈ ఎన్నిక 26 ఏళ్లలో మొదటిసారిగా పోటీ అనివార్యమైనది. అనారోగ్య కారణంగా నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమవుతున్న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ కు హాజరై వోటింగ్ లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వోటింగ్ సమయంలో సభలోనే ఉంది గెలుపొందిన ఎన్డీయే అభ్యర్థిని అభినందించారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జన్మించిన బీహార్ లోని బాలియా జిల్లాల్లో జూన్ 30, 1956న హరివంశ్ నారాయణ్ సింగ్ జన్మించారు. బనారస్ విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం లో డిప్లొమా పొందిన ఆయన ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అత్యంత నమ్మకస్థుడు.

1977లో హిందీ వార పత్రిక ధర్మయుగ్ లో జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి, ఆ తర్వాత బ్యాంకు అఫ్ ఇండియా లో చేరారు. 1984లో తిరిగి జర్నలిజం లో ప్రవేశించి ఆనంద్ బజార్ పత్రిక వారై వార పత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. జెపి భావాలతో ప్రభావితమయి, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్ద రాజకీయ సలహాదారుడిగా పనిచేశారు. ప్రభాస్ కాబార్ పత్రికకు సంపాదకుడిగా ఉంటున్న ఆయన ఆ సమయంలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసారు. చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోగానే మళ్ళి జర్నలిజం కు తిరిగి వచ్చారు. 2014లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.