బ్యాంక్ ఖాతాలు, సిమ్ కనెక్షన్ కోసం ఆధార్

ఆధార్ ఆర్డినెన్సుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బ్యాంక్ ఖాతాలను తెరువడం కోసం, మొబైల్ ఫోన్ కనెక్షన్ పొందడానికి గుర్తింపు ధ్రువీకరణగా ఆధార్ స్వచ్ఛంద వినియోగానికి ఈ ఆర్డినెన్సు దోహదపడనున్నది. లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆర్డినెన్సు జారీకి అంగీకారం తెలిపింది.

లోక్ సభకు ఎన్నికలున్న క్రమంలో సభ రద్దయితే అది ఆమోదించిన బిల్లు చట్టబద్ధతకు ఈ ఆర్డినెన్స్ చాలా అవసరం. ఇక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా రుణాలు, అనుబంధ సంస్థల బదిలీ కోసం ఓ స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 
 రూ.29,464 కోట్ల రుణాలతోపాటు ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, ఎయిర్‌లైన్ అల్లీడ్ సర్వీసెస్, ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు ఎస్‌పీవీలోకి బదిలీ కానున్నాయి. 

ఇదిలావుంటే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ప్రతిపాదిత రూ.25,000 కోట్ల రైట్స్ ఇష్యూకూ క్యాబినెట్ లైన్‌క్లియర్ చేసింది. మరోవైపు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల ప్రోత్సాహానికిగాను రూ.10,000 కోట్ల ఫేమ్-2 పథకానికీ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్స్ కోసం జాతీయ పాలసీకి కూడా క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ మినరల్ పాలసీ 2019కు కూడా ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్.. 2005 సెజ్ చట్టానికి సవర ణల కోసం ఆర్డినెన్స్ జారీకి సుముఖత వ్యక్తం చేసింది.

అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అప్రాధాన్య ఆస్తులు, శత్రు ఆస్తుల నగదీ కరణకు లైన్ క్లియర్ చేసింది. అంతేగాక చెర కు రైతుల బకాయిల చెల్లింపు కోసం చక్కెర మిల్లులకు రూ.10,540 కోట్ల వరకు కనిష్ఠ వడ్డీ రుణాలకూ ఆమోదం తెలిపింది.