ప్రపంచంలో భారత్‌ను మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా చేయడమే ఇక లక్ష్యం

వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.   గత ఐదేళ్లు  దేశ ప్రజలకు ప్రాథమిక వసతులు కల్పించడం, వారి అవసరాలను తీర్చాడం పట్ల దృష్టి సారించగా, ఇక రానున్న ఐదేళ్లు దేశం వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పారు. 

15 వేలకు పైగా ప్రదేశాలలో ఉన్న దాదాపు కోటి మంది బీజేపీ కార్యకర్తలతో గురువారం ఆయన ‘అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్‌’ నిర్వహిస్తూ 2019 ఎన్నికలలో అనుసరించ వలసిన వ్యూహం గురునించి సమాలోచనలు జరుపుతూ 2014 నుంచి 2019 వరకు అనుకున్న లక్ష్యాలను సాధించామని,  2024లోపు ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చాల్సి ఉందని చెప్పారు.   

కార్యకర్తలే బిజెపికి వెన్నుముక అని చెబుతూ దేశంలో బిజెపి మాత్రమే ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తుందని, కార్యకర్తలు అందరిని విశ్వాసంలోకి తీసుకొంటుందని చెప్పారు. అయితే మిగిలిన అన్ని పార్టీలు ఏదో ఒక కుటుంభం ఆధారంగా నిర్ణయాలు తీసుకొంటూ ఉంటాయని అంటూ 2019 ఎన్నికలు బిజెపి - కాంగ్రెస్ ల మధ్య జరుగుతున్నవి కావు, ఈ రెండు పార్టీల భావజాలం, కార్యపద్ధతిలా మధ్య జరుగుతున్న ఎన్నికలు అని స్పష్టం చేశారు. 

పాకిస్థాన్‌ మనల్ని విభజించాలని చూస్తోందని హెచ్చరిస్తూ భారతీయులంతా జవాన్లలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. 

‘మన శత్రువు మనల్ని విభజించాలని చూస్తోంది. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోంది. మన అభివృద్ధిని ఆపడమే వారి ఉద్దేశం. దేశ ప్రజలందరూ జవాన్లలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత్‌ ఐక్యంగా పోరాడుతూనే ఉంటుంది.  గెలుస్తుంది. భారత్‌ ఐక్యంగా ఉంటుంది’ అని భరోసా వ్యక్తం చేశారు. 

దేశ యువతకు, బీజేపీ కార్యకర్తలకు మోదీ సందేశం ఇస్తూ  ‘యువత చేస్తున్న ఉద్యోగం, పని ఏదైనా సరే.. కాస్త ఎక్కువగా చేయండి. ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి కష్టపడి పనిచేయండి. కొత్త ఇండియా కోసం ప్రయత్నాలు జరుపుదాం. ప్రజల్లో మాపై చాలా నమ్మకం ఉంది. ప్రభుత్వ నూతన విధానాలతో దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహం నిండింది' అని పేర్కొన్నారు. 

`బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తలకు నేను ఓ సూచన చేస్తున్నాను. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి చెప్పండి. మీరు మొదట మీ బూత్‌ స్థాయిలో ప్రజల మన్ననలు పొందితే, దేశం కోసం కూడా పనిచేయగలరు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వారికి, ప్రతిపక్షాలకు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అలాగే, బూత్‌ స్థాయి కార్యకర్తల మధ్య కూడా ఇదే విధమైన పోటీ ఉండాలి' అని ప్రధాని తెలిపారు.