భారత గగనతలంలోకి పాక్‌ యుద్ధవిమానాలు

భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పాక్‌ రెచ్చగొట్టే చర్యలను మానుకోవట్లేదు. భారత గగనతంలోకి పాక్‌ యుద్ధ విమానాలు మరోసారి ప్రవేశించినట్లు తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లోని మెంధర్‌ ప్రాంతంలో గగనతలంలో గురువారం పాక్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తున్నది.  విషయాన్ని గుర్తించిన భారత వైమానిక దళం వెంటనే ప్రతిస్పందించడంతో అవి వెనుదిరిగినట్లు చెబుతున్నారు. 

మరోవైపు పాకిస్థాన్‌.. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడుతూనే ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పూంచ్‌ జిల్లాలోని కృష్ణాఘాటీ సెక్టార్‌ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పాక్‌ కాల్పులను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. 

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ, కృష్ణా ఘాటీ సెక్టార్, నౌషెరా, పూంఛ్‌ ప్రాంతాల్లో భారత ఆర్మీ గస్తీ శిబిరాలు, సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరపడానికి పాక్‌ ప్రయత్నిస్తోంది.

 జైష్ ఎ మహ్మద్‌ ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ ఆర్మీ క్రియాశీలకంగా మద్దతు తెలుపుతోందని తాము భావిస్తున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు  వెల్లడించారు. మసూద్‌ అజర్‌తో పాటు పలువురు ఉగ్రవాద నేతలకు పాకిస్థాన్‌ ఆర్మీ వసతులు కల్పిస్తోందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ గగనతల ఉల్లంఘనలు భారత ఆర్మీ శిబిరాలపై దాడి కోసమేనని తాము భావిస్తున్నట్లు తెలిపారు. 

అలాగే, భారత వైమానిక దళ పైలట్‌పై దాడి చేసి పాకిస్థాన్‌ ఆర్మీ జెనీవా ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని తెలుస్తోందని తెలిపారు. తాము భారత ఆర్మీ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించడంలేదంటూ పాకిస్థాన్‌ చెబుతున్న విషయాలు అసత్యాలని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.